—
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందంటూ ఏసీబీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పును వెలువరించింది.
ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే విదేశాలకు నిధులు తరలించారని కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రూ.55 కోట్లు చెల్లించాలంటూ కేటీఆర్ మౌఖికంగా ఆదేశించడంతో అప్పట్లో అధికారులు ఈమేరకు చెల్లింపులు జరిపారని ఏసీబీ కేసు నమోదు చేసింది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత… కీలక అంశాలను ప్రస్తావించిన హైకోర్టు
- హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బులు బదిలీ చేసినట్లు ఆర్డర్ కాపీలో తెలిపిన హైకోర్టు
- కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలన్న హైకోర్టు
- చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని పేర్కొన్న హైకోర్టు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆర్డర్ కాపీ సిద్ధమైంది. ఈ ఆర్డర్ కాపీలో జడ్జి లక్ష్మణ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బులు బదిలీ చేసినట్లు ఆర్డర్ కాపీలో హైకోర్టు పేర్కొంది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఈ చెల్లింపుతో ఎవరు లబ్ధి పొందారో కూడా తెలియాలని ఆర్డర్ కాపీలో పేర్కొంది.
కేటీఆర్ దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయని కోర్టు తెలిపింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్లు చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయని వెల్లడించింది. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూరినట్లు ఆరోపణలు ఉన్నట్లు వెల్లడించింది.
ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నట్లు కోర్టు తెలిపింది. ఆరోపణల మేరకు పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లోనే వాడాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. దర్యాఫ్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని ఉపయోగించాలని వెల్లడించింది. పోలీసుల అధికారాలను హరించాలనుకోవడం లేదని కోర్టు పేర్కొంది. ఏసీబీ చేసిన ఆరోపణలపై తాము విచారణ చేయాలనుకోవడం లేదని వ్యాఖ్యానించింది.
ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేయరని కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే కేటీఆర్ తరఫు న్యాయవాదితో హైకోర్టు విభేదించింది. ప్రజల ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పలు కేసుల్లోని సుప్రీంకోర్టు ఉత్తర్వులను హైకోర్టు ఉదహరించింది. ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపై ఉంటుందని పేర్కొంది.
కేటీఆర్ అరెస్ట్ పై స్టే ఎత్తివేసిన హైకోర్టు.. దూకుడు పెంచనున్న ఏసీబీ, ఈడీ!
- కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
- కేటీఆర్ నివాసానికి చేరుకున్న కవిత, హరీశ్, కీలక నేతలు
- కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్న న్యాయ నిపుణులు
ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురయింది. కేసును కొట్టివేయాలంటూ ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు, ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తి వేసింది. దీంతో, ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు చెపుతున్నారు. మరోవైపు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు.
ఇంకోవైపు, నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్దకు హరీశ్ రావు, కవిత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు చేరుకుంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. కేటీఆర్ నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచారు. పార్టీ కార్యకర్తలను పోలీసులు అనుమతించడం లేదు. కేటీఆర్ నివాసం వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
ఫార్ములా ఈ-రేస్ కేసు.. కేటీఆర్ ఇంటి వెలుపల హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు!
- తప్పు చేసినట్టుగా హైకోర్ట్ చెప్పలేదన్న హరీశ్ రావు
- కేసు విచారణ కొనసాగించడానికే అనుమతించిందని వ్యాఖ్య
- వంద కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామన్న మాజీ మంత్రి
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు అరెస్టులు చేసినా, వంద కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. కేసు విచారణ కొనసాగించడానికి హైకోర్ట్ అనుమతించిందని, తప్పు చేసినట్టుగా ఎక్కడా చెప్పలేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ-రేస్‌తో రాష్ట్రానికి లాభం జరిగిందని, నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. అసలు అవినీతే జరగనప్పుడు ఈ కేసుకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని హరీశ్ రావు ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, అక్రమ అరెస్టులతో ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అవినీతి జరగలేదని, గ్రీన్ కో కంపెనీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. ఈ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు అప్పీలుకు పోవాలా? లేదా? అనేది న్యాయవాదుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు తరలి వెళ్లారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
మరోవైపు, ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. వీరిద్దరూ గురువారం ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.
ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం… సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం
- కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
- సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేటీఆర్
- కేటీఆర్ పిటిషన్ వేస్తే.. తమ వాదనలను కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్
ఫార్ములా ఈ-కార్ రేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తన లీగల్ టీమ్ తో కేటీఆర్ చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు కాపీ కోసం వీరు ఎదురు చూస్తున్నారు.
మరోవైపు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే… తెలంగాణ ప్రభుత్వ వాదనలను కూడా వినాలని పిటిషన్ లో కోరింది.
కేటీఆర్‌ను కావాలని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి: పువ్వాడ అజయ్
- ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో రూపాయి అవినీతి జరగలేదన్న మాజీ మంత్రి
- ఈ కేసులో న్యాయపరంగా పోరాడతామన్న పువ్వాడ అజయ్
- కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా ఆయన సిద్ధమేనన్న అజయ్
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో రూపాయి అవినీతి కూడా జరగలేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ కేసులో తాము న్యాయపరంగా పోరాడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేయాలని కేటీఆర్ తమకు పిలుపునిచ్చారని చెప్పారు. పార్టీ అగ్రనేత పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను ఉద్ధృతం చేస్తామన్నారు. నిజంగా కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా ఆయన సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.