- ఎమర్జెన్సీ సినిమా చూడాలంటూ రాహుల్, ప్రియాంకలను కలిసిన బీజేపీ ఎంపీ
- రాహుల్ గాంధీ అంత మర్యాదగా వ్యవహరించలేదని విమర్శ
- ప్రియాంక మాత్రం చిరునవ్వుతో పలకరించిందని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ కన్నా ప్రియాంకా గాంధీనే తెలివైందని మెచ్చుకున్నారు. ఇటీవల వారిద్దరినీ విడివిడిగా కలిసినప్పుడు తాను గమనించిన విషయం ఇది అని కంగనా వెల్లడించారు. అన్నాచెల్లెల్లలో చెల్లెలే తెలివైందని, హుందాగా స్పందిస్తుందని చెప్పారు.
ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా కంగనా రనౌత్ ఎమర్జెన్సీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిసి ఈ సినిమాను చూడాలని వారిని కోరారు. అయితే, ఆ సమయంలో రాహుల్ గాంధీ అంత మర్యాదగా ప్రవర్తించలేదని కంగన ఆరోపించారు. అదే సమయంలో ప్రియాంకా గాంధీ మాత్రం చిరునవ్వుతో పలకరించారని, ఆమెతో జరిగిన సంభాషణ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రియాంకను కలిసినప్పుడు ఎమర్జెన్సీ సినిమా చూడాలని కోరినట్లు కంగన తెలిపారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీని చాలా గౌరవంగా చూపించానని, సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పినట్లు కంగనా రనౌత్ పేర్కొన్నారు.