- కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రుల సమీక్ష
- హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు
- ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుకున్న కౌశిక్ రెడ్డి
- కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్లిన పోలీసులు
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమీక్ష రసాభాస అయింది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకోబోయారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. సంజయ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇదే అంశాన్ని కౌశిక్ రెడ్డి నేటి మంత్రుల సమీక్షలో ప్రస్తావించారు.
నువ్వు ఏ పార్టీ తరఫున గెలిచావు? ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లావు?… అసలు నీ పార్టీ ఏది? అంటూ కౌశిక్ రెడ్డి… సంజయ్ పై మండిపడ్డారు. దాంతో, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్లింది.
దాంతో అక్కడున్న నేతలు కౌశిక్ రెడ్డిని నిలువరించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సమీక్ష నుంచి బయటికి తీసుకెళ్లారు.
అనంతరం సమావేశం నుంచి బయటికి వచ్చిన కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ భిక్షతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్… కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాడని మండిపడ్డారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ పై జగిత్యాల మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ ఇచ్చిన భిక్షతో గెలిచి ఇవాళ స్టేజి ఎక్కి మాట్లాడుతున్నావా… కడుపుకు అన్నం తింటున్నావా, లేక పెండ తింటున్నావా? నీకసలు సిగ్గు, శరం, మానం, లజ్జ ఉన్నాయా? అంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సంజయ్ ని మాత్రమే కాదు, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలను రాబోయే రోజుల్లో ఎక్కడా తిరనివ్వబోమని హెచ్చరించారు.