
- స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ అంగీకారం
- భాగస్వామ్యం కోసం ముందుకొచ్చిన సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
- సీఎం సమక్షంలో ఒప్పందంపై సంతకాలు
సింగపూర్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్‌కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) ముందుకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఐటీఈ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి సీఎం సమక్షంలో ఐటీఈ అధికారులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ వీఎల్ వీఎస్ఎస్ సుబ్బారావు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఇదిలా ఉండగా, సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు.