Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు…

  • పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీం ఉత్తర్వులు
  • రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి
  • రాష్ట్ర కోటా సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని తీర్పు

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఉన్న 50 శాతం లోకల్ కోటా ఇక చెల్లదని స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్ర కోటా సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం… నివాస ఆధారిత రిజర్వేషన్లు చెల్లుబాటుకావని వివరించింది. ఈ మేరకు జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 

“మనందరం భారతదేశ భూభాగంలోనే ఉన్నాం… మనందరం భారతదేశ నివాసులమే. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు మాత్రమే కాదు… దేశంలో ఎక్కడైనా వ్యాపారం గానీ, ఇతర వృత్తులు గానీ చేసుకుని బ్రతికే హక్కు మనకు ఉంది. భారతదేశంలోని విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందడంలోనూ ఈ హక్కు వర్తిస్తుంది” అని జస్టిస్ సుధాంశు ధులియా వ్యాఖ్యానించారు. పీజీ స్థాయిలో మెరిట్ విషయంలో రాజీపడలేమని అన్నారు. కాగా, ఇప్పటికే అడ్మిషన్లు కేటాయించి ఉంటే, వాటిపై ఈ తీర్పు ప్రభావం ఉండదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఛండీగఢ్ మెడికల్ కాలేజీలో కేంద్ర పాలిత ప్రాంతాల వారికి, లేదా అదే కాలేజీలో ఎంబీబీఎస్ చదివినవారికి పీజీలో 64 సీట్లు కేటాయించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగానే సుప్రీం ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ హక్కుకు భంగం కలిగించేలా ఉందని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

Related posts

సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగ ఎలా ప్రవేశించాడు.. తొలుత ఎవరు చూశారు.. అసలేం జరిగింది?

Ram Narayana

దేశవ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు…

Ram Narayana

మిస్సయిన ఆ 26 మంది అమ్మాయిల గుర్తింపు.. ఇద్దరు అధికారులు సస్పెండ్

Ram Narayana

Leave a Comment