- అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లేలా సోనియా వ్యాఖ్యానించారని వ్యాఖ్య
- అలసిపోయారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్లో నిజం లేదన్న రాష్ట్రపతి కార్యాలయం
- భారతీయ భాష, యాసలతో పరిచయం లేకనే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న రాష్ట్రపతి కార్యాలయం
పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తప్పుబట్టింది. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
భారత అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లేలా సోనియా గాంధీ వ్యాఖ్యానించారని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. ఈ ప్రసంగంపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపింది. కాంగ్రెస్ నేతలు మాట్లాడకుండా ఉండాల్సింది అని హితవు పలికింది.
నిజాన్ని ఎవరూ దాచలేరని రాష్ట్రపతి కార్యాలయం చెప్పదలుచుకుందని, ప్రసంగం సమయంలో రాష్ట్రపతి అలసిపోయినట్లు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. ఆమె అలిసిపోయారనే మాటలు సరికాదని పేర్కొంది. అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అలసట దరిచేరలేదని స్పష్టం చేసింది.
రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన నాయకులకు భారతీయ భాష, యాసలతో పరిచయం లేకపోయి ఉండవచ్చని పేర్కొంది. అందుకే వారికి రాష్ట్రపతి అలిసిపోయినట్లుగా అనిపించవచ్చని పేర్కొంది. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని తెలిపింది.