- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన విజయసాయి
- కొన్నిరోజుల కిందట రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
- నేడు ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి
- 2029లో జగన్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్ష
ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ద్వారా విజయసాయిరెడ్డి సంచలనం సృష్టించడం తెలిసిందే. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఇవాళ పంపించారు. జగన్ ఇవాళ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.
“నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.