- పూజల్లో లోపం ఉంటే క్షమించాలని గంగామాతను ప్రార్థించిన మోదీ
- ఏర్పాట్ల విషయంలో లోపాలుంటే క్షమించాలంటూ భక్తులకు విజ్ఞప్తి
- భారతీయుల ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని
- యూపీ ప్రభుత్వం, ప్రజలు ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేశారన్న ప్రధాని
మహా కుంభమేళా సందర్భంగా పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలు క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. అలాగే, ఏర్పాట్ల విషయంలో లోపాలున్నా, భక్తులెవరైనా అసౌకర్యానికి గురైనా మన్నించాలని కోరారు.
మహా శివరాత్రి పండుగ రోజున కుంభమేళా ముగిసింది. 45 రోజుల పాటు జరిగిన ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో 66 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగిసిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
భారతీయుల ఐక్యతకు ఈ కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగించడం సులువైన విషయం కాదని ఆయన అన్నారు.
అన్ని సవాళ్లను అధిగమించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని ప్రశంసించారు. ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.