- అనర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే రద్దు చేస్తామని స్పష్టీకరణ
- దరఖాస్తుల నుండి అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టాలని సూచన
- ఫిర్యాదులు వస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్న మంత్రి
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హులకు ఇళ్లు మంజూరైనట్లు గుర్తిస్తే, నిర్మాణం ఏ దశలో ఉన్నా వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని సూచించారు. జనవరి మూడో వారంలో నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల నుండి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని అన్నారు. అర్హులైన వారికి ఇళ్లను కేటాయించడంలో పకడ్బందీగా వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. దరఖాస్తులు చేసినప్పుడే అర్హతలు నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వలేదన్న ఫిర్యాదు వస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.