టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చిన తిరువూరు కార్యకర్తలు
- వివాదాస్పదంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరు
- కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం
- ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ లు
ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. గతంలో ఆయనకు టీడీపీ హైకమాండ్ పలు హెచ్చరికలు చేసినా, ఆయన ధోరణిలో మార్పు రాలేదని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి.
కొన్ని రోజుల కిందట మరోసారి కొలికపూడి ఓ వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత అలవాల రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కొలికపూడి ఏకంగా టీడీపీ నాయకత్వానికే అల్టిమేటం ఇచ్చాడు. ఈ విషయాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.
ఈ వ్యవహారం పరిశీలనలో ఉండగానే, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. కొలికపూడికి వ్యతిరేకంగా తిరువూరు టీడీపీ కార్యకర్తలు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. మాకు కొలికపూడి వద్దు అంటూ వారు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తిరువూరు కార్యకర్తలను సముదాయించారు. తిరువూరు నుంచి వచ్చిన ముఖ్య నేతలతో పల్లా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. పార్టీ గీత దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.