
- అంతా తానై సీఎం, గవర్నర్ పర్యటనలను విజయవంతం చేసిన తుమ్మల
- సక్సెస్లో కీలక పాత్ర పోషించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, అంతా తానై భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను విజయవంతం చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ కు బాధ్యతలు అప్పగించి, ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. ఈ సారి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశముందని ముందే ఊహించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. తుమ్మల ఆదేశాలతో అధికార్లు సైతం ఇచ్చిన బాధ్యతలను భుజాన వేసుకొని ఈ మహత్తర ఘట్టాలను దిగ్విజయంగా నిర్వహించారు. భద్రాచలం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైనప్పటికీ, తగిన భద్రతా చర్యలు చేపట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనలను సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా భద్రతను కట్టు దిట్టం చేశారు. తుమ్మల నాగేశ్వర రావు ముందు నుండే రేవంత్ రెడ్డి, జిష్ణు దేవ్ వర్మల పర్యటనలను విజయవంతం చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందు కొచ్చారు. గత ప్రభుత్వం భద్రాచలం అభివృద్దికి హామీ ఇచ్చినప్పటికీ, దానిని నెరవేర్చక పోవడంతో, ఇప్పుడు భద్రాచలం వాసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గంపెడాశతో వున్నారు. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, భద్రాచలం వచ్చి పట్టణ అభివృద్దికి కట్టుబడి వున్నామని చెప్పారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను కూడా ఇక్కడి నుండే ఆవిష్కరించారు. ఆ తర్వాత, రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడే భద్రాచలం వచ్చారు. సహజంగా పట్టణాభివృద్దికి సంబంధించి ఏదైనా ప్రకటన చేయొచ్చన్న ఆశతో స్థానికులున్నారు. అది ముందే గమనించిన తుమ్మల, శ్రీరామ నవమికి వారం రోజుల ముందే, దేవాలయ మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం నుండి రూ. 34 కోట్లు మంజూరు చేయించారు. భూసేకరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు. రేపో మాపో విస్తరణ పనులు మొదలయ్యే అవకాశం వుంది. భూసేకరణ పూర్తయితే, రామలయ పునర్నిర్మాణానికి కూడా అడుగులు పడతాయి. ఇప్పటికే, ఆలయానికి సంబంధించిన నమూనాలను సిద్ధం చేశారు. ఇక సంత్సర కాలంగా ముందుకు సాగని గోదావరి కరకట్ట పనులను కూడా వర్షాకాలం లోపే పూర్తి చేయాలని అధికార్లకు డెడ్ లైన్ పెట్టారు. మరో వైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో భాగంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటుకు కూడా నాలుగు రోజుల క్రితమే, సీఎం రేవంత్ రెడ్డి నుండి ఆమోదం పొందారు. ప్రస్తుతం వున్న మైనింగ్ కళాశాలనే యూనివర్శిటీ మార్చబోతున్నారు. మొత్తం 300 ఎకరాల్లో ఈ యూనివర్శిటీ ఏర్పాటు కాబోతుంది. ఇక్కడ ఎర్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో జిల్లా ప్రజలు కోరుతున్నారు. అలాగే, ఉమ్మడి ఖమ్మ జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామా ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కూడా ఇటీవలే తుమ్మల ఆమోదం పొందారు. అలాగే, కొత్తగూడెంలో కూడా విమానాశ్రయం ఏర్పాటుకు కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. తుమ్మల ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి, విమానాశ్రయం ఏర్పాటుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారాముల కళ్యానానికి భద్రాచలం రావడానికి ముందే, తుమ్మల పథకం ప్రకారం చేస్తూ వస్తున్నారు. ఫలితంగా, అధనంగా రేవంత్ రెడ్డి జిల్లా ప్రజలకు ఏమీ ప్రకటించాల్సిన అవసరం రాలేదు. తుమ్మల ముందస్తుగా చేసిన ఈ ప్రయత్నాల వల్ల భద్రాచలంలో రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతంగా సాగింది. తుమ్మల కళ్యాణానికి రెండు రోజుల ముందు నుండే భద్రాచలంలో మకాం వేసి, అన్ని ఏర్పాట్లు చేశారు. సన్న బియ్యం లబ్దిదారుని ఇంట్లో సీఎం బోజనం చేయడాని అవసరమైన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ముందుగా వెళ్ళి వంటలు చేయడంలో తగిన సూచనలు చేశారు. వీటన్నిటినీ తుమ్మల విజయవంతం చేయడంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఇద్దరూ ఈ విషయాల్లో తుమ్మలకు ఎంతో సహకరించారు. అందుకే గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ భద్రాచలం పర్యటన ముగించుకొని వెళ్ళిన వెంటనే, తుమ్మల కలెక్టర్, ఎస్పీని అభినందించారు.