- జగన్ కు భద్రత తగ్గిస్తున్నారన్న గోరంట్ల మాధవ్
- రామగిరి పర్యటనలో భద్రతా వైఫల్యం కనిపించిందని విమర్శ
- చేసిన పనులకు రామగిరి ఎస్సై సిగ్గుపడాలని వ్యాఖ్య
ఏపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్ అని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అత్యంత ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తి కూడా ఆయనేనని చెప్పారు. జగన్ ఎక్కడికి వెళ్లినా వేలాది మంది జనం వస్తున్నారని… ఆయనకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. జగన్ కు మూడంచల భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారని… జగన్ కు మాత్రం భద్రత తగ్గిస్తున్నారని విమర్శించారు.
జగన్ రామగిరి పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని మాధవ్ అన్నారు. జగన్ పర్యటనలో 11 వందల మంది పోలీసులతో భద్రత కల్పించామని హోంమంత్రి అనిత చెబుతున్నారని… వీరిలో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి వద్దే పెట్టారని మండిపడ్డారు. హెలికాప్టర్ ను ఇబ్బందులకు గురి చేసి… మార్గమధ్యంలో జగన్ పై దాడి చేయాలని కుట్రపన్నారని ఆరోపించారు. రామగిరి ఎస్సై చేసిన పనులకు సిగ్గుపడాలని అన్నారు. సోషల్ మీడియాలో ఎస్సై పోస్టులు పెట్టడం హాస్యాస్పదమని చెప్పారు.