Ponguleti Srinivas Reddy
తెలంగాణ వార్తలు

ఈ నెల14న భూభారతి చట్టం ప్రజలకు అంకితం – మంత్రి పొంగులేటి

  • తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి వెల్లడి
  • అదే రోజు రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా ప్రారంభిస్తామని ప్రకటన
  • ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని ధీమా

ఈనెల14 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురష్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారత చట్టాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. హైదారాబాద్లోని శిల్పారామంలో సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. శుక్రవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని పినపాక శాసన సభ్యుల క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో భూభారతి చట్టం ఒక మైలు రాయిగా నిలిచి పోతుందన్నారు. ఇది పేద వాడు కష్టంతో సంపాదించుకున్న భూములను భద్రత కల్పించే ఒక అద్భుతమైన చట్టమన్నారు. భూభారతి చట్టం 2025 ను ప్రజలకు అంకితం చేసే ఈ బృహత్తర కార్యక్రమానికి  అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా అంబేద్కర్ జయంతి రోజునే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో నిరుద్యోగ యువకులకు 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందించబోతున్నామన్నారు. ప్రభుత్వంపైన ఎంత మంది, ఎన్ని శక్తులు, కుట్రలు కుతంత్రాలు పన్నినా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయలేరని అన్నారు. గత పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లోనే చేసి చూపిస్తున్నామని అన్నారు. ఆర్థిక పరిస్థితి భాగా లేక పోయినా, ఎక్కడా తగ్గకుండా ఇచ్చిన హామీల మేరకు, అభివృద్ధి సంక్షేమ పథకాలను పేదవాడి దగ్గరకు చేరుస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని, పేదలైనా, ధనికులైనా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. 500 రూపాయలకే ఉచిత గ్యాస్ ఇవ్వడంతో పాటు ప్రతి పేద కుటుంబం తృప్తిగా సన్న బియ్యంతో భోజనం చేయాలని ఉగాది పండుగ రోజున సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. తమ ప్రభుత్వము వస్తే రైతులను రాజుని చేస్తామని చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. మొత్తం 25. 65 లక్షల మంది రైతులకు 687 కోట్ల రూపాయల మేర రుణ మాఫీ జరిగిందన్నారు. సన్న వడ్లు పండించే రైతన్నలకు ఎకరానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత కూడా ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని చెప్పారు. త్వరలో పినపాక నియోజకవర్గానికి 3500 ఇండ్లు అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఎప్పటి నుండో అపరిష్కృతంగా వున్న పులుసు బొంత ప్రాజెక్టుకు రాబోయే కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగాశంకుస్థాపన చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్,పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం భోజనం చేసిన పొంగులేటి

అంతకు ముందు మంత్రి పొంగులేటి మణుగూరు మండలంలోని కూనవరం గ్రామానికి చెందిన వంక శివ లక్షి ఇంట్లో సన్న బియ్యంతో భోజనం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యంతో రుచికరమైన భోజనం పెట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పధకం వల్ల సంపన్నులతో పాటు సామాన్యులు కూడా సన్న బియ్యం భోజనం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రైతులు, పేద ప్రజలను కాపాడు కోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆనంతరం, ఆయన పినపాక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంఖుస్తాపన చేయడంతో పాటు పలు నిర్మాణాలను ప్రారంభించారు. తాళ్లగొమ్మూరు దగ్గరలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇవ్వాలి: మంద కృష్ణ

Ram Narayana

ప్రియుడి మోజులో భర్తను చంపేసి నాటకం… నిజామాబాద్ జిల్లాలో దారుణం!

Ram Narayana

వ్యాపారిని కిడ్నాప్‌ చేసి.. తుపాకులతో బెదిరించి.. రూ.10 కోట్ల డిమాండ్!

Ram Narayana