- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరిన మంత్రి తుమ్మల
- కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు అనుమనుతు లభించ లేదని వెల్లడి
- సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణానికి భూ సేకరణ జరపాలని ఆదేశం
గోదావరి నదిపై నావిగేషన్ కోసం అధ్యయనం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పోలవరం, సమ్మక్క సారక్క, అన్నారం, సుందెళ్ళ, కాళేశ్వరం రిజర్వాయర్లు పూర్తైన నేపధ్యంలో గోదావరిపై అధ్యాయనం చేసి జల రవాణాకు ప్రణాళికలు తయారు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కోరారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన పలు విద్యుత్ ఉప కేంద్రాలు, కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన డిప్యూటీ సీఏం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధికి రోడ్డు, రైల్వే, ఎయిర్, జల రవాణా వ్యవస్థలు అవసరమన్నారు. గిరిజన ప్రాంతం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి రామాలయం చుట్టూ జాతీయ రహదారులు నిర్మించడం జరుగుతుందన్నారు. కొత్తగూడెం నుండి కౌతాలంపూర్, కొత్తగూడెం నుండి హైదరాబాద్ వరకు రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే జిల్లాలో ఎయిర్పోర్ట్ కోసం గతంలో సూచించిన స్థలానికి కొన్ని కారణాల వల్ల అనుమతులు లభించ లేదని, ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం త్వరలో మళ్లీ అధ్యయనం చేస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణానికి భూ సేకరణకు చర్యలు చేపట్టాలని అధికార్లను ఆదేశించారు. ఆర్థికపరమైన కష్టాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచుకొని ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా ముందుకు తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వర రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ పోదెం వీరయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.