- గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా
- పహల్గామ్ ఉగ్రదాడికి 3నెలల ముందు ఆ ప్రాంతానికి వెళ్లిన జ్యోతి
- అక్కడ వీడియోలు తీసినట్లు వెల్లడించిన పోలీసులు
- ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారుల అనుమానం
- జ్యోతితో ఒడిశా యూట్యూబర్‌కు లింకులు?
గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు ఆమె అక్కడికి వెళ్లినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. అలాగే పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నట్లు తేలింది.
పహల్గామ్ పాశవిక దాడికి మూడు నెలల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లి వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణల కింద గతవారం హర్యానా పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి కూడా. మొత్తంగా పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లు ఆమెను ఒక అస్త్రంగా మలచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించిందని, ఒకసారి చైనాకు కూడా వెళ్లొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆపరేషన్ సిందూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీలోని అధికారి డామిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో జ్యోతి మల్హోత్రా ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ట్రావెల్ బ్యాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి 2023లో పాకిస్థాన్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు డానిష్ పరిచయమయ్యాడు. భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత కూడా అతనితో కాంటాక్ట్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతడి సూచన మేరకే అలీ అహ్సాన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాకిస్థాన్‌కు చెందిన నిఘా, రక్షణ వ్యవస్థ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు కొనసాగుతోంది.
జ్యోతితో ఒడిశా యూట్యూబర్‌కు లింకులు?
జ్యోతి మల్హోత్రాతో ఒడిశాలోని పూరిలో ఉన్న ఓ యూట్యూబర్‌కు సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతి గతేడాది సెప్టెంబరులో పూరి వచ్చి, ఓ మహిళా యూట్యూబర్‌ను కలిసింది. పూరి మహిళ కూడా పాకిస్థానీ నిఘా వర్గాలకు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చిందా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.