కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తానేమిటో అందరికీ తెలుసన్న మంత్రి
తనపై ఫిర్యాదు చేయడానికి అసలు ఏముందని ప్రశ్న
సహచర మంత్రులు ఫిర్యాదు చేశారనంటే నమ్మబుద్ధి కావడం లేదని వ్యాఖ్య
కొండా సురేఖ ,సీతక్క సమ్మక్క -సారక్కల్లా పనిచేస్తున్నారని పొంగులేటి కితాబు ..
మంత్రి కొండా సురేఖతో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. మేడారం జాతర కాంట్రాక్టు పనులను పొంగులేటి తన సొంత కంపెనీకి ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కొండా దంపతులు ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పొంగులేటి స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
తన గురించి అందరికీ తెలుసని ఆయన అన్నారు. తాను రూ. 70 కోట్ల కాంట్రాక్టు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. తనపై ఫిర్యాదు చేయడానికి అసలు విషయమేముందని ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఇద్దరూ సమ్మక్క, సారక్కల్లా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
మేడారం అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ, మేడారం అభివృద్ధికి రూ. 212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు. నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని ఆకాంక్షించారు. అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటామని అన్నారు. ఎంత ఖర్చైనా మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.మీడియా సమావేశంలో మంత్రి సీతక్క ,మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు ..
పొంగులేటితో సహా నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు: మంత్రి సీతక్క
సమక్క – సారలమ్మ ఆలయ అభివృద్ధిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సీతక్క
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి మీడియాలో వచ్చిన వార్తలు చూపానని వెల్లడి
ఆలయ అభివృద్ధి అందరి బాధ్యత అన్న మంత్రి సీతక్క

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ , సీతక్కలు సమ్మక్క -సారలమ్మల గద్దెల దగ్గర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి సీతక్క స్పందించారు …ఆమె సొంత నియోజకవర్గమైన ములుగులో జరుగుతున్న పనులపై వస్తున్నా వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు …తాను పొంగులేటితో సహా ఎవరిపై ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు ..ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చానని,వీలైనంత త్వరగా వివాదాలకు స్వస్తి పలకాలని కోరానన్నారు .. అభివృద్ధి పనులు త్వరగా జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు ..
సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయన్న మీడియా కథనాలపై మంత్రి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
మీడియాలో వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా ఆ వివాదానికి స్వస్తి పలకాలని కోరానే తప్ప తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. ఆదివాసీ వీరవనితలు సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి వివాదం లేదా అపార్థం ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా తన బాధ్యత మేరకు మీడియాలో వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు.
మేడారం ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవని మంత్రి సీతక్క అన్నారు. పనులు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. అపార్థాలు తొలగిపోయి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగాలని ఆకాంక్షించారు. మేడారం ఆలయ అభివృద్ధి మన అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల సమన్వయంతో ఆలయ అభివృద్ధి పనులను సజావుగా కొనసాగిస్తున్నదని మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో మంత్రుల వివాదంపై మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే?

మంత్రుల మధ్య వివాదాలు చాలా చిన్న అంశమన్న టీపీసీసీ చీఫ్
ఇది తమ కుటుంబ సమస్య, పరిష్కరించుకుంటామని వ్యాఖ్య
సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తాయన్న మహేశ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇది చాలా చిన్న అంశమని, తమ కుటుంబ సమస్య అని, దీనిని తామే పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించారు. ఇటీవల ఖర్గేకు పేస్‌మేకర్ అమర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఖర్గేను కలిశారు.
అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడం సహా ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను ఖర్గేకు వివరించినట్లు మీడియాకు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు…