శాంతి భద్రతల సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకం… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
విపత్కర సమయాల్లో మొదటగా స్పందించేది పోలీసులు మాత్రమే
ప్రతి పౌరులు పోలీసుల గొప్పతనం తెలుసుకోవాలి
శాంతి భద్రతల సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా మంగళవారం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, డిఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన పోలీసు అమరవీరులకు ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించాలన్నారు. ప్రభుత్వంలో ప్రతి శాఖ పని తీరులో పోలీస్ సహకారం సంపూర్ణంగా ఉంటుందని అన్నారు. భూ సేకరణ, ధాన్యం కొనుగోలు, ఎన్నికల నిర్వహణ, శాంతియుతంగా వేడుకలు జరగాలన్నా కూడా ప్రతి ఒక్క అంశంలో పోలీస్ సహకారం అవసరమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా యంత్రాంగానికి పోలీసులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు.
దీపావళి, హోళి, వినాయక నిమజ్జనం వంటి అనేక పండుగలు ప్రశాంతంగా జరుపు కోవడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రతి పౌరులు పోలీసుల గొప్పతనం తెలుసుకోవాలని, కృతజ్ఞతగా ఉండాలని, కానిస్టేబుల్ నుంచి డీజీపి వరకు నేర నియంత్రణ కోసం పాటు పడుతారని అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే 100 కు ఫోన్ చేస్తారని, అన్ని విపత్కర సమయాలలో మొదటగా స్పందించేది పోలీసులు మాత్రమే నని, 24 గంటల పాటు డ్యూటీలో ఉంటారని అన్నారు. పోలీసులు ప్రతిరోజు కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తూ మన కోసం విధులు నిర్వహిస్తున్నారని, అటువంటి వారిపట్ల మనం నిరంతరం గౌరవ భావంతో ఉండాలని అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు శాంతి చేకూరాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పోలీసు కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ 21 అక్టోబర్ 1959 లద్దాక్ ప్రాంతంలో దేశ సరిహద్దు కాపాడటంలో 10 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి మరణించారని, విధులలో ఉండి మరణించిన పోలీసుల త్యాగాలకు చిహ్నంగా మనం నేడు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.గత సంవత్సర కాలంగా భారత దేశ వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడేందుకు 191 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి పోలీసు వ్యక్తికి దేశం మొదటి ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు.
డిఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ యూనిఫామ్ చాలా పెద్ద బాధ్యత అని, ప్రతి రోజు క్రిమినల్స్ తో పోరాటం, చాలా కష్టాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. సమాజంలో శాంతి భద్రతలు పకడ్బందీగా ఉండాలంటే పోలీసులు సరిగ్గా పని చేయాలని అన్నారు. పోలీసులు సరిగ్గా పనిచేస్తున్నారు అంటే దానికి వారి కుటుంబాలు కూడా చాలా సహకరిస్తున్నాయని తెలిపారు.

అనంతరం విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు స్మారక స్ధూపం వద్ద జిల్లా కలెక్టర్, పోలీసు కమీషనర్, అటవీశాఖ అధికారి పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ పేరడ్ మైదానంలోని అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించగా, పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబీకులు పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తొలుత, అమర వీరుల స్మృత్యర్థం సాయుధ బలగాలు పెరేడ్, గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. అనంతరం పోలీసు ఆయుధాలు కిందకు దింపి వందనం చేసి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి లు ప్రసాద రావు, రామానుజం, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం.పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం: జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు
హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కలెక్టర్ ని ఆహ్వానించిన అనంతరం పెరేడ్ కమాండర్ లాల్ బాబు ఆధ్వర్యంలోని సాయుధ దళ పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘవిద్రోహశక్తులతో పోరాడి చనిపోయిన పోలీస్ పోలీసు అమరవీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.ప్రజల సంరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుందని,శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత,ప్రజల రక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించి ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించడంలో ఎల్లప్పుడూ పోలీస్ శాఖ ముందు ఉంటుందని అన్నారు.శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటమే ప్రధాన కారణమని అన్నారు.అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందని తెలిపారు.ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని,శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం నిరంతరం కాపలా కాస్తుంటారని,ఎండ,వాన,పగలు,రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగల్ని కూడా త్యజించి,ప్రజల కోసం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలని సైతం పణంగా పెట్టి సంఘ విద్రోహశక్తులతో పోరాడి వీరమరణం పొందిన పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి,గౌరవం చూపించడం మనందరి బాధ్యత అని తెలిపారు.అక్టోబర్ 21 అంటే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.1959లో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన రోజు ఇదని తెలిపారు.ఈ సమరంలో 10 మంది జవాన్లు అమరులయ్యారని,1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులోని అక్షయచిన్ ప్రాంతంలో సుమారుగా 16,000 అడుగుల ఎత్తులో తీవ్రమైన చలిలో కాపలా కాస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లు,దురాక్రమణకు ప్రయత్నించిన చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి వీర జవాన్లు ప్రాణాలర్పించడం జరిగిందని తెలిపారు.అప్పటినుంచి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు.పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనo.పోలీసుల త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుండి సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో,సేవాభావంతో పని చేస్తుందని అన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివని చెప్పారు.అమర వీరులయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఈ సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు,సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో అమరులయిన 191 మంది పేర్లను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ చదివి వినిపించారు.అనంతరం జిల్లా కలెక్టర్,ఎస్పీ గార్లతో పాటు అక్కడ పాల్గొన్న అధికారులంతా అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేందర్,డిఎస్పీలు చంద్రభాను,రెహమాన్,మల్లయ్యస్వామి,రవీందర్ రెడ్డి,సతీష్ కుమార్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ మరియు సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు,పోలీస్ కార్యాలయ సిబ్బంది,స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.