కమ్మవారు ఎక్కడ ఉంటె అక్కడ అభివృద్ధి …మంత్రి తుమ్మల
కష్టం అనేది కమ్మ కుల లక్షణం..ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మంలో ఘనంగా కమ్మవారి వనభోజనాలు

కార్తీక మాస సందర్భంగా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చేరుకూరి వారి మామిడితోటలో నిర్వహించిన వనసమారాధన కార్యక్రమం సందడిగా జరిగింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో కుటుంబాలు తరలివచ్చి పూజలు, వనభోజనాల్లో పాల్గొని కార్యక్రమానికి విశేష స్పందన చూపించారు. మామిడితోట మధ్య ప్రత్యేకంగా అలంకరించిన పూజా మండపం, దీపాలతో తీర్చిదిద్దిన దేవాలయ వాతావరణం కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కమ్మ కులం ఎక్కడ ఉన్నా అక్కడ అభివృద్ధి జరుగుతుందని, కృషి, నిబద్ధత, పట్టుదల వల్లే అన్ని రంగాల్లో కమ్మవారు గుర్తింపు పొందుతున్నారని అన్నారు. వ్యవసాయాన్ని పునాది చేసుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరిచిన వర్గం కమ్మవారేనని గుర్తుచేశారు. గ్రామీణాభివృద్ధి, సాగు విస్తరణ, సామాజిక సేవల్లో కమ్మ సంఘాలు చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని తెలిపారు.

ఎంఎల్సీ తాతా మధు మాట్లాడుతూ వ్యవసాయం నుంచి ఐటీ వరకు ప్రతి రంగంలో కమ్మవారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రపంచంలోని ఏ దేశానికెళ్లినా కమ్మవారు ఎదిగి తమ ప్రతిభను చాటుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కష్టం అనేది కమ్మ కుల లక్షణమని, అదే ఈ వర్గాన్ని ముందుకు నడిపే శక్తి అని పేర్కొన్నారు. యువత చరిత్రను తెలుసుకుని సమాజాభివృద్ధిలో బాధ్యతగా పాల్గొనాలని సూచించారు.


కార్యక్రమానికి మాజీ ఎంఎల్సీ పొట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, tgo రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాధం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వనసమారాధనలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన రుద్రాభిషేకం, దీపారాధన, వనపూజలు పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి. కుటుంబసభ్యులు కలిసి పూజలు చేయడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల కోలాటాలు, హరతులు కార్యక్రమానికి మరింత అందాన్ని తెచ్చాయి. పాల్గొన్నవారందరికీ సంఘం తరఫున వనభోజనం అందించారు. వనసమారాధన కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కర్ణాటి రమాదేవి, జాయింట్ సెక్రటరీ వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మలకుమారి, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, మేదరమెట్ల స్వరూపరాణి, నల్లమల ఆనంద్, నంబూరి సత్యనారాయణ ప్రసాద్, డా. పోతినేని భూమేశ్వర్‌రావు, కోలేటి నవీన్, తాళ్ళూరి మురళీకృష్ణ, బండి రవికుమార్ తదితర సంఘ పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.