జాతీయ వార్తలు

నేను చూసుకుంటాను.. కుటుంబ వివాదంపై తొలిసారి నోరు విప్పిన లాలు ప్రసాద్ యాదవ్

  • ఆర్జేడీ ఓటమిపై లాలు కుటుంబంలో మొదలైన రగడ
  • సోదరి రోహిణిపై చెప్పు విసిరారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజస్వి
  • తనను, తాను దానం చేసిన కిడ్నీని కూడా అవమానించారన్న రోహిణి 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు రేపింది. ఎన్నికల ఓటమిని కారణంగా చూపుతూ కుమారుడు తేజస్వి యాదవ్, కుమార్తె రోహిణి ఆచార్య మధ్య మొదలైన తీవ్ర వివాదంపై లాలు స్పందించారు. ఇది తమ కుటుంబ అంతర్గత వ్యవహారమని, తానే స్వయంగా ఈ సమస్యను పరిష్కరిస్తానని ఆయన పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సోమవారం కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేల సమావేశంలో లాలు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలోనే తేజస్వి యాదవ్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లాలు మాట్లాడుతూ ఎన్నికల కోసం తేజస్వి చాలా కష్టపడ్డాడని, పార్టీని అతడే ముందుకు నడిపిస్తాడని ప్రశంసించారు. ఈ భేటీకి లాలు భార్య రబ్రీ దేవి, పెద్ద కుమార్తె మీసా భారతి సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

అసలేం జరిగింది?
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు శనివారం తేజస్వి యాదవ్ తన సోదరి రోహిణి ఆచార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఓటమికి రోహిణే కారణమని నిందిస్తూ “నీ వల్లే మనం ఎన్నికల్లో ఓడిపోయాం” అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆమెపైకి చెప్పు విసిరి దుర్భాషలాడినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఘటన తర్వాత రోహిణి ఆచార్య సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. తనను కుటుంబం నుంచి వెలివేశారని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. తేజస్వి సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్ నెమత్ ఖాన్ ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనను, తాను తండ్రికి దానం చేసిన కిడ్నీని కూడా కించపరిచేలా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంతో లాలూ కుమార్తెలు రాజలక్ష్మి, రాగిణి, చందా కూడా పట్నాలోని అధికారిక నివాసం నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

కుటుంబంలో చిచ్చు… ప్రధాని మోదీ, అమిత్ షాకు లాలు పెద్ద కుమారుడి విజ్ఞప్తి

Tej Pratap Yadav Appeals to Modi and Shah Over Family Feud
  • తేజస్వి సహాయకులు తమ కుటుంబాన్ని, పార్టీని ముక్కలు చేస్తున్నారన్న తేజ్ ప్రతాప్
  • దర్యాప్తునకు ఆదేశించాలని మోదీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తేజ్ ప్రతాప్ 
  • తేజస్వి సహాయకులు దురాశ, అహంకారంతో విర్రవీగుతున్నారని ఆగ్రహం

తేజస్వి యాదవ్ సహాయకులు తమ కుటుంబాన్ని, పార్టీని ముక్కలు చేస్తున్నారని, అలాంటి ద్రోహుల వల్ల తమ తల్లిదండ్రులు కూడా మానసిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిసిందని లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. లాలు కుటుంబంలో చీలికల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు.

తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ, ముఖస్తుతి చేసేవారి కుట్రపూరిత రాజకీయాల వల్ల, ఆర్జేడీని బలమైన పార్టీగా మార్చడానికి ఎన్నో ఏళ్లు కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. దురాశ, అహంకారంతో విర్రవీగుతున్న తేజస్వి సహాయకులు తన తల్లిదండ్రులు లాలు ప్రసాద్, రబ్రీదేవిలను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు.

తన తండ్రి ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ పరిస్థితుల్లో వారు ఒత్తిడిని తట్టుకోలేరని ఆయన అన్నారు. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీహార్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు.

తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నానని లాలు కుమార్తె రోహిణీ ఆచార్య అన్నారు. ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, తేజస్వి మిత్రుడు రమీజ్‌ఖాన్ కారణంగానే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అనంతరం లాలూ మరో ముగ్గురు కుమార్తెలు కూడా పాట్నాలోని ఆయన ఇంటి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంలో జరుగుతున్న గొడవలకు తేజస్వి సహాయకులే కారణమని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపిస్తున్నారు.

Related posts

కేజ్రీవాల్ కు నాలుగోసారి సమన్లు పంపిన ఈడీ

Ram Narayana

రెండు గంటలు సలహా ఇచ్చి రూ. 11 కోట్లు తీసుకున్నా: ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

పూణె భూ వివాదం.. డీల్ రద్దు చేయాలన్నా రూ.42 కోట్లు చెల్లించాల్సిందే!

Ram Narayana