ఎంటర్టైన్మెంట్ వార్తలు

ఓ చేత్తో తిరగలి తిప్పుతూ రాజమౌళికి హితవు పలికిన మాధవీలత!

  • దేవుడిపై నమ్మకం లేదన్న రాజమౌళి వ్యాఖ్యలపై మాధవీలత స్పందన
  • మీ మాటలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయని హితవు
  • విశ్వాసం బలహీనత కాదని, వినయం పాతకాలపు పద్ధతి కాదని వ్యాఖ్య
  • విజయం వివేకాన్ని పెంచాలి కానీ విలువలను తగ్గించకూడదని సూచన

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఉద్దేశించి బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె స్పందించారు. రాజమౌళి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ పెట్టారు. అందులో మాధవీలత తిరగలి తిప్పుతూ మాట్లాడడం చూడొచ్చు.

“ప్రియమైన సోదరుడు రాజమౌళి గారూ, మీరు కోట్లాది మందికి స్ఫూర్తి. మీలాంటి వారు ‘నాకు దేవుడిపై నమ్మకం లేదు’ అని చెబితే, అది కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా మిగిలిపోదు. అది ఎందరో యువత మనసులపై ప్రభావం చూపే సందేశంగా మారుతుంది” అని మాధవీలత పేర్కొన్నారు.

“విశ్వాసం అనేది బలహీనత కాదు. వినయంగా ఉండటం పాతకాలపు పద్ధతి కాదు. అలాగే, మన మూలాలను అగౌరవపరచడం ఎప్పటికీ సృజనాత్మకత అనిపించుకోదు. విజయం మనలో వివేకాన్ని పెంచాలి కానీ, విలువలను తగ్గించకూడదనే విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దయచేసి బాధ్యతగా మాట్లాడండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు” అని ఆమె తన పోస్టులో వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

రాజమౌళికి మద్దతుగా హైపర్ ఆది వ్యాఖ్యలు

Rajamouli Hyper Aadi supports Rajamouli on Hanuman remarks controversy
  • సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం దారణమన్న హైపర్ ఆది
  • హనుమంతుడిని జక్కన్న అవమానించలేదని వెల్లడి 
  • వారణాసి ఈవెంట్‌లో జక్కన్న వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యల వివాదంపై నటుడు, రచయిత హైపర్ ఆది స్పందించారు. రాజమౌళికి ఆయన మద్దతుగా నిలిచారు. ‘ప్రేమంటే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆది మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం దారుణమని అన్నారు.

వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి తన గ్లింప్స్ వీడియో ఆలస్యమైందని హనుమంతుడిపై అలిగారు తప్ప, ఆయన్ను అవమానించలేదని హైపర్ ఆది స్పష్టం చేశారు. భక్తి ఎక్కువైనప్పుడు దేవుడిపై అలిగే చనువు ఉంటుందని, దానిని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన వివరించారు. కావాలనే కొందరు సినీ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారని ఆది మండిపడ్డారు.

రాజమౌళి ఏ పోస్టర్ వదిలినా, అల్లు అర్జున్ నవ్వినా, చిరంజీవి, రామ్ చరణ్‌లపై .. ఇలా ప్రతీదానిపై ట్రోల్ చేయడం అలవాటుగా మారిందని, ఇది సరైన పద్ధతి కాదని హైపర్ ఆది హితవు పలికారు.

కాగా, వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వీడియో ప్లే అవ్వడం ఆలస్యం కావడంతో ఆయన హనుమంతుడిని ఉద్దేశించి సరదాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఈ వివాదంపై ఇప్పటి వరకు రాజమౌళి గానీ, ఆయన చిత్ర బృందం గానీ అధికారికంగా స్పందించలేదు.

Related posts

విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. కారణం ఇదే!

Ram Narayana

ఒక స్టార్ హీరోకి ‘నో’ చెప్పాను: అనసూయ

Ram Narayana

నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్‌ పర్సన్‌తో సంబంధం లేదు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Ram Narayana