మేడారంలో తెలంగాణ క్యాబినెట్ అసాధారణ భేటీ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భవనాల నిర్మాణకి భూములు ఇవ్వాలని నిర్ణయం
2027 జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు
హైద్రాబాద్ మెట్రో 2 ఏ ,బి దశలకు ఆమోదం
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
క్యాబినెట్ నిర్ణయాలని వెల్లడించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ క్యాబినెట్ అసాధారణ భేటీ ఆదివారం మేడారంలోని సమ్మక్క -సారలమ్మ గద్దెల వద్ద అసాధారణ భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది ..రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సహజంగా రాజధానిలో జరుగుతుంది …అందుకు భిన్నంగా మేడారంలో జరగడం విశేషం .మొత్తం మంత్రి వర్గం రాష్ట్ర అధికార యంత్రాంగం ,సీఎం పేషీ మేడారానికి షిఫ్ట్ అయింది . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక భేటీలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు ..
తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో నిన్న జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
చరిత్రలో తొలిసారిగా మేడారంలో 27వ కేబినెట్ భేటీ నిర్వహించామని, మంత్రి సీతక్క చొరవతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల ఏకాభిప్రాయంతో సమావేశం విజయవంతంగా సాగిందని పొంగులేటి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించిన 14 ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులు, డివిజన్లలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా రెండు రోజుల క్రితమే రిజర్వేషన్లు ఖరారయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల చేసే దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.
అలాగే 2027 జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో, వాటిని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు, దీనికి సంబంధించిన కన్సల్టెన్సీ నివేదికను ఫిబ్రవరి 15లోపు సమర్పించనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ – 2 ఏ, బీ దశలపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగిందని, భూసేకరణ కోసం రూ.2,787 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లపూర్ ఎత్తిపోతల పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
మళ్లీ బాంబు పేల్చిన కొండా సురేఖ ?