హైద్రాబాద్ వార్తలు

ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్.. ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణం…

  • ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణం
  • రూ. 800 కోట్ల అంచనాతో జీహెచ్‌ఎంసీ పనులు
  • సిగ్నల్ ఫ్రీ కారిడార్‌గా మార్చి ప్రయాణ సమయం తగ్గించడమే లక్ష్యం
  • 2028 మే నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం

నగరంలోని ఐటీ కారిడార్‌లో వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను సిగ్నల్ ఫ్రీ కారిడార్‌గా మార్చేందుకు బహుళస్థాయి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ, విప్రో జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ సుమారు రూ. 800 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఐఎస్‌బీ నుంచి డీఎల్‌ఎఫ్ వరకు నాలుగు లేన్ల ఫ్లైఓవర్, ముంబై హైవే నుంచి డీఎల్‌ఎఫ్ వైపు రెండు లేన్ల వన్‌వే ఫ్లైఓవర్, ఇందిరా నగర్ నుంచి హెచ్‌సీయూ వరకు ఒక అండర్‌పాస్‌ను నిర్మించనున్నారు.

ఐటీ కారిడార్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లతో ఉద్యోగులు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సి వస్తోంది. గత వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. “ఈ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులు ఒక్క సిగ్నల్ వద్ద కూడా ఆగకుండా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఇంధనాన్ని కూడా గణనీయంగా ఆదా చేస్తుంది” అని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

2028 మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే కోకాపేట నియోపొలిస్‌కు కూడా రవాణా సులభతరం అవుతుంది. పాత ముంబై హైవేపై ప్రయాణం కూడా సాఫీగా మారనుండటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి…

Ram Narayana

హైదరాబాదులో చాలా ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షం…

Ram Narayana

విద్యార్థుల నిరసన… హెచ్‌సీయూలో ఉద్రిక్తత!

Ram Narayana