ఆంధ్రప్రదేశ్

విశాఖలో అట్టహాసంగా అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవాలు…

  • విశాఖలో ఘనంగా ప్రారంభమైన IFR-2026
  • 50 దేశాలు, 70 యుద్ధనౌకలతో మెగా వేడుకలు
  • పది రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు
  • 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

భారత నౌకాదళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష’ (IFR-2026) నిన్న విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. మన దేశంలో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు విశాఖపట్నం రెండోసారి వేదిక అయింది.  2016లో జరిగిన IFR తర్వాత మరోసారి 2026లోనూ విశాఖనే ఎంపిక చేయడం ద్వారా నగర ప్రాధాన్యతను భారత నౌకాదళం మరోసారి చాటిచెప్పింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 25 వరకు పది రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుమారు 50 దేశాల నుంచి 4,000 మంది అతిథులు, 70కి పైగా అత్యాధునిక యుద్ధనౌకలు పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పది రోజులు విశాఖ నగరం నేవీ సిబ్బంది సందడి, యుద్ధనౌకల వెలుగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

ఈసారి ఉత్సవాలు కేవలం IFRకే పరిమితం కాకుండా మూడు ప్రధాన కార్యక్రమాల సమాహారంగా నిర్వహిస్తున్నారు. IFRతో పాటు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ‘మిలాన్’ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్‌సైజెస్, అలాగే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (ఐఓఎన్ఎస్) కార్యక్రమాలు కూడా విశాఖలోనే జరగనున్నాయి. దీంతో హిందూ మహాసముద్ర పరీవాహక దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రదేశాలతో సముద్ర భద్రత, పరస్పర సహకారం అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. నిన్న సాయంత్రం ‘మిలాన్’ పేరుతో ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించడం ద్వారా ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ గ్రామంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయగా.. విదేశీ అతిథులకు ఇది ‘మినీ ఇండియా’గా కనిపిస్తోంది. 

కాగా, ఫిబ్రవరి 18న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యుద్ధనౌకలను సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 19న ఆర్‌కే బీచ్‌లో నిర్వహించే ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పరేడ్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అలాగే ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సముద్రంలో జరగనున్న యుద్ధ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గతంలో అండమాన్‌కు పరిమితమైన ‘మిలాన్’ విన్యాసాలను ఈసారి మెరుగైన మౌలిక వసతుల దృష్ట్యా విశాఖకు మార్చడం పర్యాటక రంగానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, వివిధ దేశాల యుద్ధనౌకలు, జలాంతర్గాములను దగ్గర నుంచి చూసే అరుదైన అవకాశం ప్రజలకు లభించనుంది.

Related posts

రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం

Ram Narayana

ఏడాదిన్నరలో పోలవరం పూర్తి చేసి తీరుతాం .. ఏపీ సీఎం చంద్రబాబు

Ram Narayana

మరో సారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

Ram Narayana