అంతర్జాతీయం

మధ్యప్రాచ్యానికి కదిలిన అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు…

  • అధునాతన ఎఫ్-22, ఎఫ్-35, ఎఫ్-16 ఫైటర్ జెట్ల మోహరింపు
  • బయల్దేరిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ యుద్ధ నౌక
  • ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ పరిణామం
  • ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక బలగాల తరలింపుతో ఉత్కంఠ

ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరుపుతూనే, అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తుండగానే, మరోవైపు భారీగా యుద్ధ విమానాలను, నౌకలను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. గత 24 గంటల్లో 50కి పైగా అధునాతన ఫైటర్ జెట్లను ఈ ప్రాంతంలో మోహరించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది.

యాక్సియోస్ కథనం ప్రకారం.. అమెరికా వాయుసేనకు చెందిన ఎఫ్-22 రాప్టర్స్, ఎఫ్-35 లైట్నింగ్ II, ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్స్ వంటి శక్తిమంతమైన యుద్ధ విమానాలు ఈ మోహరింపులో ఉన్నాయి. అమెరికా, యూరప్‌లోని స్థావరాల నుంచి ఈ విమానాలను జోర్డాన్, ఖతార్‌లోని సైనిక స్థావరాలకు తరలించారు. ఇదే సమయంలో, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ విమానవాహక నౌక తన బృందంతో కలిసి కరేబియన్‌ను వీడి మధ్యప్రాచ్యం వైపు పయనిస్తోంది.

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై రెండో విడత పరోక్ష చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ సైనిక మోహరింపు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ చర్చలు ఫలప్రదంగా సాగాయని, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయని ఇరు దేశాల అధికారులు తెలిపారు. అయినప్పటికీ, చర్చలతో పాటు సైనిక ఒత్తిడిని కొనసాగించడం ద్వారా ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక ఈ ప్రాంతంలో ఉండగా, ఇప్పుడు గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ రాకతో అమెరికా సైనిక బలం మరింత పెరగనుంది. రాబోయే రెండు వారాల్లో ఇరాన్ నుంచి ప్రతిపాదనలు అందాక, తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉంది.

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం వార్నింగ్

Iran Supreme Leader Ali Khamenei Warns Trump
  • సంచలన వ్యాఖ్యలు చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ 
  • ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదన్న ఖమేనీ
  • ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం ఉన్నవారికైనా తీవ్ర ఎదురుదెబ్బ తగలవచ్చని హెచ్చరిక

అమెరికా – ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదని, భవిష్యత్తులోనూ సాధించలేదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం ఉన్నవారికైనా తీవ్ర ఎదురుదెబ్బ తగలవచ్చని హెచ్చరించారు.  

ఇరాన్‌లో పాలన మార్పు, యుద్ధ నౌకల మోహరింపు అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదే సమయంలో జెనీవా వేదికగా ఇరాన్ – అమెరికాల మధ్య పరోక్ష అణు చర్చలు కొనసాగుతుండటం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. 

ఖమేనీ చేసిన వరుస ట్వీట్లలో .. తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో అది కోలుకోలేనంత దెబ్బతినే అవకాశమూ ఉంది. ఇరాన్‌ వైపు యుద్ధ నౌకలను పంపిస్తున్నామని ప్రకటిస్తున్నారు. అవి ప్రమాదకరమైనవే. అయితే, వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యమున్న ఆయుధం మరింత ప్రమాదకరం. 47 ఏళ్లుగా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను ఏమీ చేయలేకపోయామని అమెరికానే అంగీకరిస్తోంది. ఇకముందూ చేయలేరు. అణు చర్చలు జరుపుదామంటారు. కానీ చివరికి మీ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని ముందే తీర్పు చెబుతారు. చర్చల ఫలితాలను ముందుగానే నిర్ణయించడం మూర్ఖత్వమే అని ఘాటుగా వ్యాఖ్యానించారు.  

కాగా, జెనీవాలో అమెరికా – ఇరాన్‌ మధ్య జరిగిన అణు చర్చలు సుమారు మూడు గంటల్లో ముగిశాయి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్‌ హర్మూజ్ జలసంధిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. భద్రతా కారణాలతో జలసంధిని కొన్ని గంటల పాటు మూసివేసి, లైవ్ క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా సైనిక మోహరింపులు కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతంలో టెహ్రాన్‌ ఈ చర్యలు చేపట్టింది. 

Related posts

సిబ్బంది మీద చేయి వేసినందుకు పదవి పోగొట్టుకున్న న్యూజిలాండ్ మంత్రి!

Ram Narayana

ఇటలీ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు..

Ram Narayana

అమెరికాలో చదువుల కల చెదిరింది.. 19 దేశాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం!

Ram Narayana