- ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గల్గోటియాస్ వర్సిటీ స్టాల్ ఏర్పాటు
- చైనా అభివృద్ధి చేసిన రోబోను తమదిగా పేర్కొంటూ స్టాల్‌లో ప్రదర్శన
- కేంద్రం పీఆర్ స్టంట్స్ చేస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం
- చైనా అభివృద్ధి చేసిన రోబోను మనదిగా చూపించారని ఆగ్రహం
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం చైనా రోబోడాగ్‌ను తాము అభివృద్ధి చేసినట్లుగా పేర్కొంటూ ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సదస్సులో నుంచి గల్గోటియాస్ విశ్వవిద్యాలయానికి ఉద్వాసన పలికింది. ఈ వివాదంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సును అధ్వానంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ ప్రతిభను ప్రపంచానికి చూపకుండా పీఆర్ స్టంట్ చేస్తున్నారని ఆరోపించారు. భారతీయుల డేటాను అమ్మకానికి పెట్టి చైనా ఉత్పత్తులతో షో చేస్తున్నారని విమర్శించారు. చైనా అభివృద్ధి చేసిన రోబోలను మనవిగా చూపించి అవమానాలకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సమ్మిట్‌ను ఒక జోక్‌గా మార్చారని మండిపడ్డారు. భారతదేశం ప్రతిభను కనబర్చాల్సిన చోట ఈ తీరు దారుణమని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏఐ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని నవ్వులపాలు చేసిందని అన్నారు. చైనా రోబోలను మనవిగా ప్రదర్శించినందుకు ఆ దేశ మీడియా మనల్ని ఎగతాళి చేస్తోందని అన్నారు. ఇది దేశానికి నిజంగా ఇబ్బందికరమైన పరిణామమని అన్నారు.
చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ప్రచారం.. ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్

- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో బయటపడ్డ మోసం
- గల్గోటియాస్ యూనివర్సిటీని సదస్సు నుంచి బహిష్కరించిన నిర్వాహకులు
- విద్యార్థుల పరిశోధనల కోసమే వాడుతున్నట్లు వర్సిటీ వివరణ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో ఓ యూనివర్సిటీ నిర్వాకంతో కలకలం రేగింది. చైనాకు చెందిన రోబో డాగ్ ను తమ ఆవిష్కరణగా ప్రదర్శించడమే ఈ కలకలానికి కారణం. ఉత్తరప్రదేశ్ కు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఈ రోబోట్ వీడియోలు వైరల్ కాగా.. చైనాకు చెందిన రోబో డాగ్ ను పోలి ఉందని నెటిజన్లు గుర్తించడంతో యూనివర్సిటీ మోసం బయటపడింది. దీంతో యూనివర్సిటీపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సదస్సు నుంచి ఆ విద్యాసంస్థను తక్షణమే గెంటివేసి, వారికి కేటాయించిన స్టాల్‌ను అధికారులు ఖాళీ చేయించారు.
అసలేం జరిగిందంటే..
గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ఏఐ సదస్సులో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. తమ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో ‘Orion’ పేరుతో ఒక రోబోడాగ్‌ను స్వయంగా అభివృద్ధి చేశామని వర్సిటీ ప్రతినిధులు ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మోసం బయటపడిందిలా..
యూనివర్సిటీ ప్రదర్శించిన రోబోడాగ్ చైనాకు చెందిన రోబోటిక్ కంపెనీ ‘యూనిట్రీ’ అభివృద్ధి చేసిన ‘Go2’ మోడల్‌ను పోలి ఉందని నెటిజన్లు గుర్తించారు. ఆన్‌లైన్ లో సుమారు రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల ధరకు భారతీయులకూ ఈ రోబోడాగ్ అందుబాటులో ఉంది. దీంతో సదరు యూనివర్సిటీ మోసం బయటపడింది. విదేశీ టెక్నాలజీని కొనుగోలు చేసి, దానిని భారత్ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
యూనివర్సిటీ ఏమంటోందంటే..
వివాదం ముదరడంతో యూనివర్సిటీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. తాము దానిని చైనా నుంచే కొనుగోలు చేశామని చెప్పింది. విద్యార్థుల పరిశోధనల కోసం ఒక సాధనంగా మాత్రమే వాడుతున్నామని పేర్కొంది. ఆ రోబో డాగ్ ను తామే అభివృద్ధి చేశామని ఎక్కడా ప్రచారం చేసుకోలేదని పేర్కొంది. అయితే, సోషల్ మీడియాలో ఉన్న వీడియోల్లో మాత్రం ఆ విద్యాసంస్థ ప్రతినిధులు ఇది తమ సొంత ఆవిష్కరణ అని స్పష్టంగా చెప్పడం గమనార్హం.
కేంద్రం సీరియస్.. కఠిన చర్యలు
అంతర్జాతీయ ప్రతినిధులు, టెక్ దిగ్గజాలు హాజరైన సదస్సులో ఇలాంటి తప్పుదారి పట్టించే చర్యలకు పాల్పడటంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్‌ను తొలగించి, సదస్సు నుంచి వారికి ఉద్వాసన పలికింది.
చైనా రోబోడాగ్ వివాదం.. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏం చెప్పారంటే?

- రోబో డాగ్‌ను తాము అభివృద్ధి చేశామని చెప్పలేదన్న ప్రొఫెసర్లు
- తప్పుగా అర్థం చేసుకున్నారన్న ప్రొఫెసర్ నేహా సింగ్
- తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందన్న ప్రొఫెసర్
చైనా యూనిట్రీకి చెందిన రోబో డాగ్‌ను ఢిల్లీలో జరుగుతోన్న ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో ప్రదర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చైనా కంపెనీ తయారు చేసిన ఈ రోబో డాగ్‌ను తామే అభివృద్ధి చేసినట్లు గల్గోటియాస్ యూనివర్సిటీ పేర్కొన్నట్లుగా వార్తలు రావడంపై ఆ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు స్పందించారు.
ఈ చైనీస్ ఏఐ ఆధారిత రోబో డాగ్‌ను తాము అభివృద్ధి చేసినట్లు ఎప్పుడూ చెప్పలేదని, సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరిగిందని ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నేహా సింగ్ మాట్లాడుతూ, రోబోకు సంబంధించిన ప్రత్యేకతలను వివరిస్తున్న క్రమంలో కొన్ని వ్యాఖ్యలను పొరపాటుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తమ విద్యార్థులు రోబోటిక్ సైన్స్ గురించి ఎలా అధ్యయనం చేస్తున్నారో, ఏం అభివద్ధి చేస్తున్నారో వివరించే క్రమంలో కొంత తప్పుడు సంకేతాలు వెళ్లాయని అన్నారు. తమ వ్యాఖ్యలను కొన్నింటిని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో తమ స్టాల్ వివాదానికి కారణం కావడం తమకు బాధగా ఉందని అన్నారు. పరిశోధన, అభ్యాస వ్యాయామంలో భాగంగా చైనాకు చెందిన ఈ రోబోను ఎక్స్‌పోకో తీసుకువచ్చినట్లు చెప్పారు. తమ విద్యార్థుల అధ్యయనం, పరిశోధన కోసం ఈ డాగ్ రోబోను తీసుకువచ్చామని అన్నారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సు దేశాన్ని గర్వపడేలా చేసిందని, కానీ అనుకోకుండా ఈ వివాదం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే మా విశ్వవిద్యాలయం ఎన్నోసార్లు దేశం గర్వించేలా చేసిందని, ఈ ప్రభావం తమ యూనివర్సిటీపై ఉంటుందని తాము భావించడం లేదని నేహా సింగ్ అన్నారు. తాము చెప్పిన విషయాలు ప్రజల్లోకి తప్పుగా వెళ్లాయని స్పష్టంగా చెబుతున్నానని అన్నారు.
ఈ విషయంలో పొరపాటు జరిగినందుకు మరో ప్రొఫెసర్ ఐశ్వర్య శ్రీవాస్తవ విచారం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పాల్గొని భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ఆలోచన తమకు లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్ కోసం తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి తాము క్షమాపణ చెప్పడం లేదని, కానీ తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని అన్నారు. తమ విద్యార్థులు ఐవోఎస్ యాప్‌లను అభివృద్ధి చేశారని అన్నారు.