టి 20 మ్యాచ్ లు

టీ20 వరల్డ్ కప్: గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత్… నెదర్లాండ్స్ పై విజయం…

  • టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై భారత్  17 పరుగుల తేడాతో విజయం
  • ఆల్ రౌండర్ శివమ్ దుబే అద్భుత ప్రదర్శన
  • బ్యాటింగ్‌లో 66 పరుగులు, బౌలింగ్‌లో 2 వికెట్లు తీసిన దుబే
  • మూడు వికెట్లతో సత్తా చాటిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
  • గ్రూప్-ఏలో చివరి లీగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించిన టీమిండియా

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో శివమ్ దుబే ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. బ్యాటింగ్‌లో అద్భుత అర్ధశతకం సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గ్రూప్-ఏలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి, ఓటమన్నదే లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టనుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు నెదర్లాండ్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే అభిషేక్ శర్మ (0) వికెట్ కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ (18) వేగంగా ఆడాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34) నిలకడగా రాణించారు. అయితే, అసలు సిసలు విధ్వంసం సృష్టించింది శివమ్ దూబేనే. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (30) కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశారు.

194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ గట్టిగానే పోరాడింది. బాస్ డి లీడ్ (33), కోలిన్ అకెర్‌మాన్ (23), జాక్ లయన్-కాచెట్ (26) రాణించారు. అయితే, భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. శివమ్ దూబే బంతితోనూ రాణించి 2 వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తద్వారా 4 మ్యాచ్ ల్లో 4 విజయాలతో గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచింది. 

సూపర్-8లో గ్రూప్-1లో ఉన్న భారత్… ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్ తో తలపడనుంది. 

శివమ్ దూబే దంచుడు… భారత్ భారీ స్కోరు

Shivam Dube Blasts India to Huge Score in T20 World Cup
  • టీ20 వరల్డ్ కప్‌లో శివమ్ దూబే విధ్వంసక బ్యాటింగ్
  • కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు
  • ఆరంభంలో తడబడ్డా.. భారత్ భారీ స్కోరు నమోదు
  • సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కీలక పరుగులు
  • నెదర్లాండ్స్ ముందు 194 పరుగుల టార్గెట్

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్ శివమ్ దూబే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దూబే మెరుపులతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (18) వేగంగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా (30)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా దూబే తనదైన శైలిలో భారీ షాట్లతో నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హార్దిక్ కూడా మూడు సిక్సర్లతో రాణించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (6 నాటౌట్) కూడా ఓ సిక్సర్ బాదడంతో భారత్ భారీ స్కోరు అందుకుంది.

నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3 వికెట్లు, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశారు.

Related posts

టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా కొత్త జెర్సీ.. ప్రత్యేకతలివే!

Ram Narayana

టీ20 ప్రపంచకప్: ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు.. కుటుంబాలకు ‘నో’!

Ram Narayana

ధర్మశాల టీ20లో టీమిండియా అదుర్స్… దక్షిణాఫ్రికాపై ఘనవిజయం…

Ram Narayana