- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న ఎన్నికల నగారా
- ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
- పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అనంతరం ఈరోజు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ విడుదల చేశారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.67 కోట్లుగా నమోదైంది. గతంలో ఉన్న 6.41 కోట్ల ఓటర్లతో పోలిస్తే, ఈ ప్రక్షాళనలో ఏకంగా 74 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం గమనార్హం. డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు, నివాసం మారుతున్న వారి వివరాలను క్షుణ్ణంగా వెరిఫై చేసిన తర్వాతే ఈ భారీ తొలగింపులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
లింగ నిష్పత్తి పరంగా చూస్తే ఈసారి కూడా తమిళనాడులో మహిళా ఓటర్లే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 5,67,07,380 మంది ఓటర్లలో 2.89 కోట్ల మంది మహిళలు ఉండగా, 2.77 కోట్ల మంది పురుషులు, 7,617 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు వచ్చిన లక్షలాది అప్లికేషన్లను పరిశీలించి, అర్హులైన కొత్త ఓటర్లను కూడా జాబితాలో చేర్చారు. ఈ వేసవిలో జరగబోయే ఎన్నికల కోసం ఈ జాబితానే కీలకం కానుంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: