తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త అందించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులను ఇకపై ప్రతీ వారం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో నిర్మాణ పనుల్లో జాప్యం తొలగిపోయి, ఇళ్ల నిర్మాణం వేగవంతం కానుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క… ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వీలైనంత త్వరగా తమ ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. బిల్లుల చెల్లింపు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని, ప్రతి వారం నిధులు విడుదలయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు. గతంలో ఈ పథకం ప్రారంభమైనప్పుడు వారానికోసారి బిల్లులు ఇచ్చినా, ఆ తర్వాత ఆర్థిక కారణాలతో నిలిచిపోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న విమర్శలను భట్టి విక్రమార్క తిప్పికొట్టారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఇప్పటివరకు ఉన్న పరిమితులను తొలగించి, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌తో సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో కూడా అర్హులను ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా బిల్లుల చెల్లింపుపై భట్టి ఇచ్చిన హామీతో ఇళ్ల నిర్మాణంలో మరింత వేగం పుంజుకోనుంది.
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ బకాయిల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మూడు డీఏ బకాయిలను తమ ప్రభుత్వం త్వరలోనే క్లియర్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని, అందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన వాటానే రూ. 4,571 కోట్లు ఉందని భట్టి విక్రమార్క వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బకాయిలను మానవతా కోణంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, వాటిని కూడా త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, అలాగే ఉద్యోగుల కోసం క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు కూడా అందజేశామని గుర్తుచేశారు.