ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని, వారు ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలుగా, బీజేపీకి బానిసలుగా మారారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలి, స్వలాభం కోసం పనిచేస్తున్న ఎంపీలంతా తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇవాళ లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిపై జరిగిన చర్చలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే, తెలుగు ఎంపీలపై షర్మిల విరుచుకుపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
పార్లమెంట్ వేదికగా ఏపీ విభజన హామీల గురించి గళం విప్పిన మాణికం ఠాగూర్‌కు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అయితే, ఆయన మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రం నుంచి గెలిచిన ఒక్క ఎంపీ కూడా మద్దతుగా నిలబడకపోవడం తెలుగుగడ్డ చేసుకున్న దౌర్భాగ్యమని మండిపడ్డారు. “మన ఎంపీలకు స్వలాభం మిన్న, రాష్ట్ర ప్రయోజనాలు సున్నా. పేరుకు మాత్రమే వేర్వేరు పార్టీల ఎంపీలు, కానీ అందరూ మోదీకి భజనపరులే. బీజేపీ బిల్లులకు గొర్రెల్లా తలలూపడం తప్ప, 11 ఏళ్లు గడుస్తున్నా హోదా ఏమైందని అడిగే దమ్ము ఒక్కరికీ లేదు” అని షర్మిల ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41 మీటర్లకే పరిమితం చేస్తామని లిఖితపూర్వకంగా చెబుతున్నా, రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయలేమని స్పష్టం చేస్తున్నా ఎంపీలు నోరు మెదపడం లేదని ఆమె విమర్శించారు. ఇప్పటివరకు విభజన హామీలలో 5 శాతం కూడా అమలు కాలేదని, అయినా మన ఎంపీలు మౌనం వహిస్తూ ‘గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారని’ ఘాటుగా వ్యాఖ్యానించారు.
“2014లోనే విభజన హామీల విలువ 5 లక్షల కోట్లు. అది మన చేతిలో ఉన్న చెక్కు లాంటిది. కానీ మన ఎంపీల అసమర్థత వల్లే దాన్ని ఎన్‌క్యాష్ చేసుకోలేకపోతున్నాం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించే ధైర్యం లేని 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలి” అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.