జనరల్ వార్తలు ...

యుద్ధం …శాంతి… ట్రంప్ దోబుచులాట

యుద్ధం ఏ రకంగానూ ప్రపంచానికి మంచిది కాదు ..ట్రంప్, నేతన్యాహు కలిసి ఆడిన నాటకం బెడిసి కొట్టింది …తాము ప్రపంచ శాంతి కామకులమని వివిధదేశాల మధ్య జరుగుతున్న జరగబోతున్న యుద్ధాలను తానే ఆపానని తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలని అడిగిన ట్రంప్ అసలు రూపం తెలిసి పోయింది …ట్రంప్ యుద్ధ పిచాచుడని తేలిపోయింది .ఇజ్రాయెల్ మాటలు నమ్మి యుద్ధంలోకి దిగిన ట్రంప్ కు సొంత దేశంలోనే వ్యతిరేకత వచ్చింది ఆయన కుంటున్న ఒకపక్ష చర్యలపై అమెరికన్లు భగ్గుమంటున్నారు …నువ్వు రాజువు కాదు …నో కింగ్ ఇన్ అమెరికా అంటూ వీధుల్లోకి వెక్కారు…దిక్కు తోచనిస్థితిలో ఉన్న ట్రంప్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు ట్రంప్ మాటలు విని ప్రపంచం నివ్వెర పోయింది.

 ట్రంప్ హెచ్చరికల వెంటే టెహ్రాన్‌పై భీకర దాడులు.. 13 మంది మృతి!

Donald Trump Warnings Followed by Tehran Attacks 13 Dead

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా క్షిపణుల దాడులకు పాల్పడ్డాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో 13 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగానే అమెరికా ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.

టెహ్రాన్‌లోని కీలక ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ ఘటనలో ప్రఖ్యాత షరీఫ్ యూనివర్సిటీ భవనంతో పాటు సమీపంలోని గ్యాస్ పైప్‌లైన్ కూడా ధ్వంసమైంది. దాడుల సమయంలో యూనివర్సిటీలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని విద్యా సంస్థలన్నీ ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను నామరూపాల్లేకుండా చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘నరకం అంటే ఏంటో చూపిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం.

ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. ట్రంప్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఇరాన్ సాంస్కృతిక మంత్రి రెజా సాల్హీ అమిరీ విమర్శించారు. ప్రస్తుతం టెహ్రాన్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్…

Donald Trump Warns to Bomb Iran if No Deal by Deadline

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు.

“మంగళవారం ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం అవుతుంది. హర్మూజ్ జలసంధిని తెరవండి, లేదంటే నరకంలో బతుకుతారు. చూస్తూ ఉండండి!” అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో తీవ్ర పదజాలంతో పోస్ట్ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పాలనతో విసిగిపోయిన ఇరాన్ పౌరులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఇలాంటి చర్యలను సమర్థిస్తారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో ట్రంప్ అమెరికాను సజీవ నరకంలోకి లాగుతున్నారని ఆరోపించారు. ఈ ప్రమాదకరమైన ఆటను ఆపాలని హెచ్చరించారు.

మరోవైపు, తెరవెనుక దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా రాయబారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రితో నేరుగా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే, మంగళవారం గడువు సమీపిస్తున్నా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

ఇరాన్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్… ‘గాడ్ ఈజ్ గుడ్’ సందేశంతో గందరగోళం!

Donald Trump Reveals US Secret Operation in Iran

ఇరాన్ భూభాగంలో కూలిపోయిన అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమాన సిబ్బందిలో ఒకరిని కాపాడిన ఉత్కంఠభరిత ఆపరేషన్ గురించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఇరాన్ పర్వత ప్రాంతంలో చిక్కుకుపోయిన అధికారి పంపిన “గాడ్ ఈజ్ గుడ్” (దేవుడు గొప్పవాడు) అనే మూడు పదాల రేడియో సందేశం.. తొలుత అమెరికా అధికారుల్లో తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు కారణమైందని ఆయన తెలిపారు. అమెరికా బలగాలను ఉచ్చులోకి లాగేందుకు ఇరాన్ దళాలే ఈ నకిలీ సిగ్నల్స్ పంపుతున్నాయని వారు అనుమానించినట్లు యాక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వివరించారు.

విమానం నుంచి బయటకు దూకిన తర్వాత గాయపడిన వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ పర్వత ప్రాంతంలో ఒక పగులులో దాక్కుని 24 గంటలకు పైగా ప్రాణాలతో నిలిచారు. అతని కోసం వేలాది మంది ఇరాన్ సైనికులు, స్థానిక పౌరులు గాలిస్తున్నారని, పట్టిచ్చిన వారికి బహుమతులు కూడా ప్రకటించారని ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో, సుమారు 200 మంది ప్రత్యేక దళాలతో అమెరికా అత్యంత సాహసోపేతమైన రాత్రిపూట రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

“ఆ రేడియో సందేశం ఒక ముస్లిం మాట్లాడినట్లుగా అనిపించింది” అని ట్రంప్ అన్నారు. అయితే, ఆ అధికారికి దైవభక్తి ఎక్కువని, అందుకే అలా అని ఉండవచ్చని తర్వాత అధికారులు స్పష్టం చేశారు. దీంతో అతనిని ఇరాన్ దళాలు బంధించి, తప్పుడు సంకేతాలు పంపుతున్నాయనే అనుమానాలు తొలగిపోయాయి.

ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో సీఐఏ చేపట్టిన డిసెప్షన్ ఆపరేషన్ కీలకపాత్ర పోషించింది. ఆ అధికారి దొరికాడని, అతడిని భూమార్గంలో తరలిస్తున్నారని ఇరాన్‌లో తప్పుడు సమాచారాన్ని సీఐఏ ప్రచారం చేసింది. దీంతో ఇరాన్ దళాలు తప్పుదోవ పట్టి, అసలు ప్రదేశం నుంచి దృష్టి మరల్చాయి. అదే సమయంలో, చిక్కుకుపోయిన అధికారి తన ఆచూకీ బయటపడకుండా ఉండేందుకు బీకాన్‌ను పరిమితంగా వాడుతూ, ఒక సురక్షిత ఎన్‌క్రిప్టెడ్ పరికరం ద్వారా అమెరికా దళాలతో సమన్వయం చేసుకున్నాడు.

ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ కూడా పరిమితంగా సహాయపడిందని ట్రంప్ వెల్లడించారు. రెస్క్యూ ప్రదేశం వైపు వస్తున్న ఇరాన్ దళాలను నెమ్మదింపజేయడానికి ఇజ్రాయెల్ వైమానిక దళం ఒక దాడి చేసిందని, అలాగే ఇరాన్ సైనిక కదలికలపై సమాచారాన్ని అందించిందని ఆయన తెలిపారు. పూర్తి సమాచారం అందిన తర్వాత తాను రెస్క్యూ మిషన్‌కు అధికారం ఇచ్చానని, ఆపరేషన్ విజయవంతమైనట్లు ట్రూత్ సోషల్‌లో ధ్రువీకరించానని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు.. ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ ఆగ్రహం

Iran Angered by Trump Remarks on United Nations

ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితికి అంతరాత్మ అనేది ఉంటే అమెరికా అధ్యక్షుడి యుద్ధోన్మాదంపై మౌనంగా ఉండదని వ్యాఖ్యానించింది. ట్రంప్ ఈ ప్రాంతాన్ని ముగింపు లేని యుద్ధంలోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి యుద్ధ నేరాలను అంతర్జాతీయ సమాజం నిరోధించాలని పేర్కొంది.

ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది. మౌలిక సదుపాయాలను పేల్చేస్తామంటూ ట్రంప్ బెదిరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.  ట్రంప్ వ్యాఖ్యలపై ఐరాస, అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసింది. ఆలస్యం చేయకూడదని తెలిపింది.

ఆయన వ్యాఖ్యలు ఇరాన్ పౌరులను భయపెట్టడం కిందకే వస్తాయని తెలిపింది. కాబట్టి ఆయన వ్యాఖ్యలు యుద్ధనేరమేనని ఇరాన్ స్పష్టం చేసింది. కాగా, ఇరాన్‌కు నరకం చూపిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.

రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా!

America Destroys Own Aircraft Worth Rs 931 Crore in Iran

ఇరాన్ భూభాగంలో తమకు చెందిన అత్యాధునిక విమానాన్ని అమెరికా స్వయంగా బాంబులతో పేల్చివేసింది. సుమారు 931 కోట్ల రూపాయల ($100 మిలియన్లు) విలువైన ఈ విమానాన్ని శత్రుదేశానికి చిక్కకూడదనే ఏకైక కారణంతో ధ్వంసం చేసింది. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ ఫైటర్ పైలట్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం రహస్యంగా ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో పైలట్‌ను తరలించేందుకు వెళ్లిన విమానాల్లో ఒకటి సాంకేతిక లోపంతో ఎడారి ప్రాంతంలో నిలిచిపోయింది. ఆ విమానంలో అత్యంత కీలకమైన సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రహస్య యుద్ధ సాంకేతికత ఉన్నాయి.

ఈ టెక్నాలజీ ఇరాన్ చేతికి చిక్కితే తమ సైనిక రహస్యాలు బయటపడతాయని అమెరికా భావించింది. ఆర్థికంగా భారీ నష్టమైనా భరించి, దేశ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అక్కడున్న కమాండోలు ఆ విమానాన్ని పేల్చివేసి, పైలట్‌ను మరో విమానంలో సురక్షితంగా తరలించారు. ఈ ఘటన 1980లో జరిగిన ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ వైఫల్యాన్ని గుర్తుచేస్తోంది. అప్పట్లో కూడా అమెరికా తమ విమానాలను ఇరాన్ ఎడారిలో వదిలిరావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈసారి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా అమెరికా జాగ్రత్త పడింది.

ప్రస్తుతం ఇరాన్ ఈ విమాన శకలాల ఫొటోలను విడుదల చేస్తూ, అమెరికా ఆపరేషన్ విఫలమైందని ప్రచారం చేస్తోంది. అయితే, వందల కోట్ల ఆస్తి కన్నా సైనిక రహస్యాలకే ఎక్కువ విలువిస్తామని ఈ చర్య ద్వారా అమెరికా స్పష్టం చేసింది.

యుద్ధం ఎఫెక్ట్.. ఆసియాలో ఖాళీగా నిలిచిపోయిన 50 గ్యాస్ ట్యాంకర్లు

Hormuz Strait Conflict 50 LNG Tankers Stranded in Asia

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా రవాణా దాదాపు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆసియా ప్రాంతంలో సుమారు 50 ఎల్ఎన్జీ ట్యాంకర్లు ఖాళీగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో పాటు ఖతార్‌లో ఎగుమతులు నిలిచిపోవడంతో ట్యాంకర్లు ఖాళీగా నిలిచిపోయాయి.

గడిచిన రెండు దశాబ్దాలుగా ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ వాణిజ్యానికి కీలక కేంద్రంగా ఉంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇక్కడి గ్యాస్ పరిశ్రమపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించడంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎల్ఎన్జీ గ్యాస్ కోసం రస్ లఫాన్ వెళ్లిన నౌకలు హర్మూజ్ జలసంధి వద్ద పదుల సంఖ్యలో నిలిచిపోయాయి.

ఇదిలా ఉండగా, భారత్, శ్రీలంక తీరంలో, మలక్కా జలసంధికి ఉత్తర ప్రవేశ ద్వారంలో, సింగపూర్‌కు తూర్పున ఉన్న జలాల్లోనూ ఈ ట్యాంకర్లు ఖాళీగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏ ఒక్క ట్యాంకర్‌లోనూ ఎల్ఎన్జీ లేదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 ఎల్ఎన్జీ ట్యాంకర్లు నిర్వహణలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌తో యుద్ధం.. ఆ దేశంలోని కుర్దులు మోసం చేశారంటూ ట్రంప్ ఆగ్రహం

Donald Trump Angered by Kurds Alleged Betrayal in Iran Arms Deal

ఇరాన్‌లోని కుర్దులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌లో నిరసనకారులకు చేరవేసేందుకు తాము రహస్యంగా ఆయుధాలు పంపిస్తే, అవి వారికి చేరలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

ఇరాన్‌లో నిరసనకారులకు ఆయుధాలు చేరవేయాలనే ఉద్దేశంతో కుర్దుల ద్వారా వాటిని పంపించామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున తుపాకులు పంపించినట్లు తెలిపారు. కానీ ఈ ఆయుధాలు నిరసనకారులకు చేరలేదని అనుకుంటున్నానని, వాటిని కుర్దులు తమ వద్దనే ఉంచుకున్నట్లుగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో ఇరాన్‌లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో అమెరికా ఆయుధాలను పంపించే ప్రయత్నం చేసింది. ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కుర్దుల ద్వారా నిరసనకారులకు ఆయుధాలను చేరవేయాలనుకుంది. కానీ ఈ ఆయుధాలు నిరసనకారులకు చేరకుండా కుర్దులు తమ వద్దనే ఉంచుకున్నారని తాజాగా ట్రంప్ ఆరోపించడం గమనార్హం.

Related posts

మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్.. అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలు..

Ram Narayana

అవమానాలు ఇక చాలు… రాజీనామాకు ముహూర్తం ఖరారు చేసిన జీవన్ రెడ్డి

Ram Narayana

నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం!

Ram Narayana