తెలంగాణ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని కేరళ సీఎం పినరయి విజయన్‌కి సీఎం రేవంత్ సవాల్ …
తెలంగాణ ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు. తెలంగాణ అభివృద్ధిపై మీతో చర్చకు తాను సిద్ధమని కేరళ సీఎం పినరయి విజయన్‌కి సీఎం రేవంత్ సవాల్ చేశారు..
ఏప్రిల్ 7వ తేదీన కేరళ రాజధాని తిరువనంతపురంలో ముఖాముఖి చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణలోని పాత డేటాతో విజయన్ విమర్శలు చేశారని వివరించారు. 2023 డిసెంబర్ నాటికే ఆ పాత డేటా శకం ముగిసిందన్నారు రేవంత్. తెలంగాణ వృద్ధి రేటు టాప్‌లో ఉందని వివరించారు. 2024-25లో తెలంగాణ జీఎస్‌డీపీ (GSDP) 10.1 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేశామని చెప్పారు. అలాగే 25.36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చామని తెలంగాణ సీఎం సోదాహరణగా వివరించారు. గడచిన 28 నెలల్లో 67,763 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని గణాంకాలతో సహా వివరించారు. కేరళలో బ్రెయిన్ డ్రైన్ పెరిగిపోయిందంటూ సీఎం రేవంత్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా ఆ రాష్ట్రంలోని పారిశ్రామిక వృద్ధి సైతం కుంటుపడిందని తెలిపారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ ఫేమస్ డైలాగ్ “నీ పో, మోనే విజయన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దాంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కేరళ సీఎం సంధించారు. దీంతో కేరళ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్‌గా సీఎం రేవంత్ స్పందించారు.