తెలంగాణ వార్తలు

లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీజీపీ…

తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, తాజాగా భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో మొత్తం 42 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి ఈరోజు జనజీవన స్రవంతిలోకి చేరారు. లొంగిపోయిన వారిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ స్థాయి కలిగిన కేశాలు వంటి కీలక నేతలు ఉండటం విశేషం. 

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, గత ఏడాదిన్నర కాలంలోనే మొత్తం 763 మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి ప్రభుత్వానికి లొంగిపోయారని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ కార్యకలాపాలు ముమ్మరం కావడంతో, తమ రక్షణ కోసం మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

లొంగిపోయిన వారిలో అత్యధికులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారేనని, తెలంగాణకు చెందిన వారు కేవలం ఒక్కరే ఉన్నారని డీజీపీ స్పష్టం చేశారు. ఒకప్పుడు సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీల్లో తెలంగాణ వాసుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆయన వివరించారు. సెంట్రల్ కమిటీలో 11 మంది నుంచి ఇద్దరు, స్టేట్ కమిటీలో 24 మంది నుంచి కేవలం ఇద్దరు మాత్రమే మిగిలారని, వారు కూడా త్వరలోనే లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

లొంగిపోయిన 42 మందికి పునరావాస ప్యాకేజీ కింద రూ. 1.93 కోట్ల నగదును అందజేయడంతో పాటు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారికి ప్రత్యేక ఆరోగ్య కార్డులను కూడా జారీ చేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పునరావాస అవకాశాలను అందిపుచ్చుకుని, అడవి బాట పట్టిన వారంతా తిరిగి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల బదిలీ.. కొత్త సీపీలు వీరే!

Ram Narayana

శ్రీనివాస్ రెడ్డికి సుమన్ టీవీ చైర్మన్ శుభాకాంక్షలు

Ram Narayana

ఎన్నికల స్టంట్ అనుకోండి!: ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana