- హైదరాబాద్ శివార్లలో కురిసిన భారీ వడగళ్ల వాన
- శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఓఆర్ఆర్‌పై మంచు దృశ్యాలు
- రోడ్లపై పేరుకుపోయిన మంచుతో ఆడుకున్న జనం
- ఫొటోలు, రీల్స్‌తో సోషల్ మీడియాలో సందడి
- భాగ్యనగరం కశ్మీర్‌లా మారిందంటూ నెటిజన్ల కామెంట్లు
ఏప్రిల్ నెలలో ఎండలతో అల్లాడే భాగ్యనగరంలో ఒక్కసారిగా హిమాలయాలు ఆవిష్కృతమయ్యాయి. కశ్మీర్‌లోని మంచు వీధులను తలపించే దృశ్యాలు హైదరాబాద్ నగర రోడ్లపై దర్శనమిచ్చాయి. నిన్న సాయంత్రం నగరంలో కురిసిన భారీ వడగళ్ల వాన, ఊహించని అద్భుతానికి కారణమైంది. ముఖ్యంగా శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రకృతి సృష్టించిన ఈ వింతకు నగరవాసులు అబ్బురపడ్డారు. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఓఆర్ఆర్, తెల్లని మంచు దుప్పటి కప్పుకొని యూరప్‌లోని శీతాకాలపు అందాలను గుర్తుచేసింది.
సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అయితే, శివారు ప్రాంతాల్లో ఈ వర్షం కాస్తా వడగళ్ల తుపానుగా మారింది. ముఖ్యంగా ఓఆర్ఆర్‌పై కుండపోతగా కురిసిన వడగళ్ల కారణంగా, కొద్ది నిమిషాల్లోనే రోడ్డుకు ఇరువైపులా అంగుళాల మందం మేర మంచు పేరుకుపోయింది. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు, ఈ అనూహ్య దృశ్యాన్ని చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. వాహనాలను పక్కకు ఆపి మరీ మంచుతో ఆడుకుంటూ, ఒకరిపై ఒకరు మంచు గడ్డలను విసురుకుంటూ సరదాగా గడిపారు.
ఈ అరుదైన వాతావరణాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు యువత పోటీపడింది. రోడ్డుపై పేరుకుపోయిన మంచు కుప్పల వద్ద నిలబడి ఫొటోలు, వీడియోలు, రీల్స్ తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ‘హైదరాబాద్ హిమాలయాలు’, ‘ఓఆర్ఆర్ కశ్మీర్’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
“ఇక యూరప్ వెళ్లక్కర్లేదు, మన ఓఆర్ఆర్‌కి వెళితే చాలు” అంటూ సరదా కామెంట్లు పెట్టారు. అయితే, రోడ్డుపై మంచు గడ్డల కారణంగా వాహనాలు జారిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు, వెంటనే అప్రమత్తమై వాహనదారులకు సూచనలు జారీ చేశారు. ఏదేమైనా మండే ఎండల నుంచి ఈ వడగళ్ల వాన నగరవాసులకు గొప్ప ఊరటనివ్వడంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని మిగిల్చింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: