జర్నలిస్టు కావాలన్నదే బాపు కోరిక
జర్నలిస్టు డైరీ ఆవిష్కరణలో వెల్లడించిన ఎమ్మెల్యే వివేకానంద
కాలం యోదులకు అండగా నిలవండిః విరహత్ అలీ
తాను కూడా జర్నలిస్టు కావాలని మా బాపు కోరిక అని, తప్పకుండా జర్నలిజం చదువు త్వరలో పూర్తి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద తెలిపారు. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టియూడబ్ల్యుజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది – నూతన డైరీని బుధవారం ఆవిష్కరించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఎంఎల్ ఆర్ ఐటి సంస్థ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడని అన్నారు. పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో, ఒక వార్తను సేకరించడానికి విలేఖరి తన సర్వశక్తులూ ఉపయోగిస్తాడన్నారు. జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులున్నా అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను రానున్న అసెంబ్లీ సమావేశాలలో అవకాశం దొరికించుకొని మరీ చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
కాలం యోదులకు అండగా నిలవండిః విరహత్ అలీ
ఎన్నో వ్యయప్రయాసాలకు లోనవుతూ జర్నలిజం వృతిని కొనసాగిస్తున్న వారికి ప్రజాప్రతినిధులు, సంఘం అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.విరహత్ అలీ అన్నారు. అరుందతి ఆస్పత్రి నిర్వాహకులు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున జర్నలిస్టులకు ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆరుందతి ఆస్పత్రిలో భవిష్యత్తులోను ఇదే విధంగా జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ఉచితంగా సేవాలను అందించాలని మర్రి రాజశేఖర్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య కార్డులు సరిగా పనిచేయడం లేదనీ, విలేకరుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా పాటుపడాలని ఎమ్మెల్యే కెపి వివేకానందను కోరారు.
జర్నలిస్టులకు సేవలు ఎప్పుడు అందిస్తాముః మర్రి రాజశేఖర్‌రెడ్డి
ఆరోగ్యాలను కాపాడుకోవడంలో జర్నలిస్టులు నిర్లక్ష్యం వహించరాదని బిఆర్ ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి, అరుందతి ఆస్పత్రి నిర్వాహకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. విద్యాసంస్థల నిర్వహణ నుంచి విలేకరులతో సన్నిహిత సంబందాలు ఉన్నాయని, రాజకీయ రంగ ప్రవేశంతో అది మరింత పెరిగిందన్నారు. ఇదే సహకారం మునుముందు కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఐజేయు కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి, జిల్లా వివిధ ప్రెస్ క్లబ్ ల అధ్యక్షకార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
