జాతీయ వార్తలురాజకీయ వార్తలు

మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక అవినీతి ఆరోపణలు…చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని బీజేపీ హెచ్చరిక …

మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక అవినీతి ఆరోపణలు…
చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని బీజేపీ హెచ్చరిక …
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం కమీషన్ తీసుకుంటుందని ప్రియాంక గాంధీ పోస్ట్
తీవ్రంగా స్పందించిన రాష్ట్ర బీజేపీ, ప్రభుత్వం
కాంగ్రెస్ దారుణ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఆగ్రహం
ప్రియాంక పోస్టుకు ఆధారాలు చూపించాలని లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయన్న బీజేపీ

మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, 50 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రియాంకపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ బీజేపీ హెచ్చరించింది. ఆమె ఆరోపణలు తప్పని మధ్యప్రదేశ్ హోంనమంత్రి నరోత్తమ్ మిశ్రా ఖండించారు. ఆరోపణలకు సంబంధించి ఆమె వద్ద ఆధారాలు ఉంటే చూపించాలని, లేదంటే తాము తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.

తమ వద్ద నుండి 50 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ల సంఘం నేతలు హైకోర్టు న్యాయమూర్తికి రాసినట్లుగా ఉన్న లేఖను ప్రియాంక గాంధీ శుక్రవారం పోస్ట్ చేశారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ తీసుకుంటే మధ్యప్రదేశ్‌లో ఏకంగా 50 శాతం తీసుకొని తమ రికార్డులను తామే తిరగరాస్తున్నారని, ఇప్పటికే కర్ణాటకలో బీజేపీని ఇంటికి పంపించారని, మధ్యప్రదేశ్ 50 శాతం సర్కార్ మిగిలి ఉందని ప్రియాంక పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ధీటుగా స్పందించింది.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దారుణ రాజకీయాలు చేస్తోందని మిశ్రా విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మొదట రాహుల్ గాంధీతో అబద్దాలు చెప్పించారని, ఇప్పుడు ప్రియాంక గాంధీతో తప్పుడు ట్వీట్ చేయించారన్నారు. ప్రియాంక గారూ… మీ పోస్టుకు రుజువు చూపించడం.. లేదా మా చర్యలకు సిద్ధంగా ఉండండి అని మంత్రి హెచ్చరించారు.

ఆమె పోస్ట్ చేసింది నకిలీ పోస్ట్ అని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడి శర్మ హెచ్చరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికార దాహంతో ఉందని, అబద్ధాలు చెబుతూ అధికారంలోకి రావాలని భావిస్తోందన్నారు. ప్రియాంక ఈ ఆరోపణలు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయన్నారు. ప్రియాంక తన పోస్ట్ ద్వారా మధ్యప్రదేశ్‌నే కాదు.. దేశాన్ని కూడా తప్పుదోవ పట్టించారన్నారు. ఆమె పోస్ట్‌పై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. అయితే తాము అవినీతిని నిరూపిస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ కేకే మిశ్రా అన్నారు.

Related posts

రాహుల్ తో కలిసి నడిచిన మహాత్మాగాంధీ ముని మనవడు!

Drukpadam

బ్రిటన్‌లో డాక్టర్‌నంటూ నమ్మించి హైదరాబాద్ మహిళకు టోకరా…

Ram Narayana

ఢిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్.. 1600 మందిపై కేసు…

Ram Narayana