- గాజాను మళ్లీ ఆక్రమించుకుంటే అది పెద్ద తప్పే అవుతుందన్న బైడెన్
- గాజాలోని పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ ప్రాతినిధ్యం వహించబోదన్న అమెరికా అధ్యక్షుడు
- ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా వెళ్లబోదని ఆశాభావం
గాజాపై భూతల దాడికి సిద్దమవుతున్న వేళ ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. గాజాను ఆక్రమించుకోవద్దంటూ ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా 29 మంది అమెరికన్లు సహా 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘సీబీఎస్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. గాజా స్ట్రిప్‌ను పూర్తిస్థాయిలో ఆక్రమించుకోవడాన్ని తాము సమర్థించబోమన్నారు.
‘‘అది చాలా పెద్ద తప్పే అవుతుంది’’ అని బైడెన్ చెప్పుకొచ్చారు. గాజాలో ఏం జరుగుతోందో తన కోణంలో చెప్పాలంటే.. అక్కడి పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రాతినిధ్యం వహించబోదని తేల్చి చెప్పారు. కాబట్టి గాజాను కనుక ఇజ్రాయెల్ మళ్లీ ఆక్రమించుకుంటే అదిపెద్ద తప్పే అవుతుందని చెప్పారు. అయితే, అక్కడున్న ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందేనని బైడెన్ వివరించారు. ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లదన్న విశ్వాసం తనకు ఉందని బైడెన్ పేర్కొన్నారు.
ముగిసిన డెడ్‌లైన్.. గాజా నుంచి తరలిపోయిన 10 లక్షల మంది.. భూతల దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధం..
- గాజాను విడిచిపెట్టాలంటూ డెడ్‌లైన్ విధించిన ఇజ్రాయెల్
- గాజా సరిహద్దులో 4 లక్షల మందిని మోహరించిన ఇజ్రాయెల్
- గాజా ఉత్తర ప్రాంతానికి నీరు, విద్యుత్తు, ఆహార సరఫరాను నిలిపివేసిన ఇజ్రాయెల్
గాజాను విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ ఇచ్చిన వార్నింగ్ డెడ్‌లైన్ ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికిపైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు. గాజాపై దండెత్తేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ ఇప్పటికే సరిహద్దులో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్స్ (ఐఏఎఫ్) సహా 4 లక్షల మంది రిజర్వులను మోహరించింది.
గాజాపై భూతలదాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన గాజా ఉత్తర ప్రాంతానికి నీళ్లు, విద్యుత్తు సరఫరా నిలిపివేసింది. ఆహారం అందకుండా చేసింది. గాజా దక్షిణ ప్రాంతానికి మాత్రం నిన్న నీటి సరఫరాను పునరుద్ధరించింది. ఇజ్రాయెల్‌పై దాడులకు సూత్రధారిగా భావిస్తున్న హమాస్ కమాండర్ యహ్యా సిన్వార్‌ను ‘డెడ్ మ్యాన్ వాకింగ్’ (నడుస్తున్న చనిపోయిన వ్యక్తి)గా ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ రిచర్డ్ హెచ్ట్ అభివర్ణించారు.