
- మోహన్ బాబు ఇంటి గేటు ముందు బైటాయించిన మనోజ్
మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో సారి రచ్చకెక్కింది. బుధవారం ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోకి మంచు మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవక పోవడంతో ఆయన బయటే బైఠాయించారు. ముందే అప్రమత్తమైన పోలీసులు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మోహన్‌బాబు ఇంటి నుండి 2 కిలో మీటర్ల వరకు ఆంక్షలు విధించారు. తన కారు పోయిందని మంగళవారం మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు పుట్టిన రోజు వేడుకల కోసం జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని సోదరుడు విష్ణు తన ఇంట్లోని కారు తీసు కెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. విష్ణు 150 మందితో జల్ పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామాగ్రి ధ్వంసం చేశారని. తమ కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తు కెళ్లి రోడ్డు మీద వదిలేశారని. తన కారును తీసుకెళ్లి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని ఆరోపించారు. అంతే కాకుండా జల్ పల్లిలోని తన భద్రతా సిబ్బందిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం తన తండ్రితో మాట్లాడలంటూ జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గరకు మనోజ్ చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు లోపలికి అనుమతించక పోవడంతో గేటు బైటే కూర్చున్నారు. తన ఇంట్లోకి తాను వెళ్లడానికి అనుమతి కావాలని పోలీసులు అంటున్నారని, మోహన్‌బాబు చెబితేనే లోపలికి పంపిస్తామని చెబుతున్నారని మనోజ్ తెలిపారు. కోర్టు నోటీసులతో వచ్చినా లోపలికి పంపించడం లేదని, తన సమస్యను పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మనోజ్ విజ్ఞప్తి చేశారు.