Yarra Srikanth
ఖమ్మం వార్తలు

పోటెత్తిన ‘యర్రా’ దండు

  • శ్రీకాంత్‌ అంతి మయాత్రకు తరలి వచ్చిన వేలాది మంది
  • సీసీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు అరుణ్‌ కుమార్‌ నివాళి
  • పాడె మోసిన పార్టీ నేతలు అరుణ్‌, పోతినేని, నున్నా
  • సంతాప సభలో శ్రీకాంత్‌ ఔన్నత్యాన్ని స్మరించుకున్న నేతలు

సీసీఐ(ఎం) అఖిల భారత 24వ మహాసభలకు ప్రతినిధిగా హాజరై ఆకస్మికంగా మృతి చెందిన యర్రా శ్రీకాంత్‌కు బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రకు వేలాదిగా జనం తరలి వచ్చారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా కదలి వచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హాజరయ్యారు. శ్రీకాంత్‌ భౌతికకాయంపై సీపీఐ (ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.అరుణ్‌ కుమార్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో శ్రీకాంత్‌ పాడెను అరుణ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, నున్నా నాగేశ్వరరావు మోశారు. శ్రీనివాసనగర్లోని శ్రీకాంత్‌ నివాస గృహం నుంచి మొదలైన అంతిమ యాత్ర కాల్వవొడ్డులోని వైకుంఠ ధామం వరకు సాగింది. అక్కడ కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

శ్రీకాంత్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి : ఆర్‌.అరుణ్‌కుమార్‌

దీనికి ముందు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు అధ్యక్షతన శ్రీకాంత్‌ స్వగృహం అక్షయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన సంతాప సభలో నేతలు మాట్లాడారు. శ్రీకాంత్‌ ఔన్నత్యాన్ని చాటుతూ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ఆర్‌.అరుణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మహాసభలకు ప్రతినిధిగా హాజరైన శ్రీకాంత్‌తో 4 వ తేదీ ఉదయం తాను మాట్లాడానని, ఎంతో కలుపుగోలుగా వ్యవహరించే వారని గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో విద్యార్థి ఉద్యమాభివృద్ధికి సైతం తోడ్పడ్డారని తెలిపారు. తాను ఎస్‌.ఎఫ్‌.ఐ.ఆలిండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సీపీఐ (ఎం) ఖమ్మం పట్టణ కార్యదర్శిగా ఉన్న  శ్రీకాంత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన కుటుంబం పార్టీ కోసం నిలబడ్డారని, ఇప్పుడు పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరముందన్నారు.

సీపీఐ (ఎం) అంటేనే ‘యర్రా’ కుటుంబం: తమ్మినేని వీరభద్రం

సీపీఐ (ఎం) అంటేనే ‘యర్రా’ కుటుంబం. ‘యర్రా’ కుటుంబం అంటేనే సీపీఐ (ఎం) అనే రీతిలో ఆ కుటుంబం పార్టీతో పెనవేసుకుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశాన్ని మతోన్మాద ప్రభావం నుంచి రక్షించాలని ఆలిండియా మహాసభ దిశా నిర్దేశం చేసిందన్నారు. వామపక్షాలను బలోపేతం చేయటం ద్వారానే అది నెరవేరుతుందని భావిస్తున్న దశలో శ్రీకాంత్‌ లాంటి పోరాట యోధుడు మన నుంచి దూరం కావడం బాధాకరమన్నారు. మతోన్మాదంపై మహాసభ తీర్మానంపై చర్చల్లోనూ శ్రీకాంత్‌ పాల్గొన్నారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఉద్యమంపై తాత్కాలికంగా ఆకర్షణ తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో కర్తవ్యాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. శ్రీకాంత్‌తో పాటు ఆయన భార్య యర్రా సుకన్య, పిల్లలు కుటుంబం అంతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.

శ్రామికవర్గాల రాజ్య స్థాపన శ్రీకాంత్‌ లక్ష్యం: జాన్‌ వెస్లీ

శ్రామిక వర్గాల రాజ్య స్థాపనకు పనిచేసిన నేత యర్రా శ్రీకాంత్‌ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. అన్ని వర్గాల కోసం పని చేసిన నాయకుడి మరణం తీరని లోటని చెప్పారు. తమతో పాటు మహాసభలకు వచ్చి ప్రతినిధుల సమావేశంలో పార్టీ పెంపు కోసం చేపట్టాల్సిన చర్యలపై  మాట్లాడి, చేతిలో చెయ్యేసి మాట్లాడిన శ్రీకాంత్‌ గంటల వ్యవధిలోనే చని పోవడం బాధాకరమన్నారు. శ్రీకాంత్‌ మరణం పార్టీకి తీరని లోటని, ఆయన మృతికి సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం ప్రకటించారు.

పెద్దన్నలాగా భావించాం: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

యర్రా శ్రీకాంత్‌ అన్నను పెద్దన్నలాగా భావించామని, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. అటువంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని పేర్కొన్నారు. శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.  సీపీఐ(ఎం) పార్టీ సైతం 4 రోజులుగా ఆయన కుటుంబాన్ని అంటి పెట్టుకొని మనోధైర్యం కల్పిస్తున్నదని తెలిపారు. ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటి సభ్యులు ఎం.సాయిబాబు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పార్టీ సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు,  సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, బండారు రవికుమార్‌, ప్రభాకర్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, మచ్చా వెంకటేశ్వర్లు, బండి రమేష్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.జె.రమేష్‌, అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు, రాష్ట్ర నాయకురాలు జాన్సీ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్‌, యర్రా శ్రీనివాసరావు, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, బండి పద్మ, మాదాపూర్‌ డీఎస్పీ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులపై కేసు నమోదు ను ముక్తకంఠం తో ఖండించిన అఖిలపక్షం

Ram Narayana

: ఆయన నాకు ఎంతో సహకారం అందించారు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కంటతడి..

Ram Narayana

ఈనెల 5 న బుగ్గపాడు కు ఐదుగురు మంత్రులు ..

Ram Narayana