KTR
తెలంగాణ రాజకీయ వార్తలు ..

గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ కొత్త డిమాండ్

  • సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ జరపాలి
  • రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు
  • బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే గద్దె దింపుతారు  
  • రూ. 10 వేల కోట్ల కుంభ కోణం జరిగిందని పునరుద్ఘాటన

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును స్వాగతిస్తూ, ఈ విషయంలో కేంద్రం, సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) రిపోర్ట్‌లో చెప్పిన అంశాలు,  తాము వారం నుంచి చెబుతున్న విషయాలను ధ్రువీకరించాయని కేటీఆర్ పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో మరొక ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిరికి పందని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ కుంభ కోణం వెలుగులోకి రావాలంటే ఆర్బీఐ కూడా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. సీబీసీ, సీబీఐ కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదనను తాను విన్నానని, వారి ఆవేదన నిజమే అయితే తెలంగాణలోని ఆర్థిక దోపిడీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసినప్పుడు, తాను విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని స్పష్టంగా చెప్పానని, కానీ అధికారులను బలి పశువులను చేయలేదని అన్నారు. ఈ విషయంలో విధానపరమైన నిర్ణయానికి బాధ్యత తనదేనని అన్నారు. మంచి జరిగితే తనది, చెడు జరిగితే అధికారులది అని చెప్పే సంస్కృతి తనకు లేదని అన్నారు.హెచ్‌సీయూ భూవివాదంపై రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా స్పందించాలని కోరారు. తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఐసీ రుణం తీసుకోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే స్వయంగా రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని ఆయన అన్నారు. ఎందరో నియంతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Related posts

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు …సిపిఎం

Ram Narayana

మోదీ ప్రభుత్వంతో సయోధ్య కోరుకుంటున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ram Narayana

రాజగోపాల్‌రెడ్డి తిరిగి వస్తే 24 గంటల్లో టిక్కెట్ కేటాయించారు: పాల్వాయి స్రవంతి భావోద్వేగం

Ram Narayana