ఉత్తరాఖండ్ లో గురువారం ఉదయం హెలికాప్టర్ కూలి ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఏపీకి చెందినవారు ఉన్నట్లు గుర్తించారు. అనంతపురం ఎంపీ సోదరి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కాశీ జిల్లాలో ఉదయం 9 గంటల సమయంలో హెలికాప్టర్ కూలి పోయింది. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్ భగీరథి నది సమీపంలో కుప్ప కూలి పోయింది. ప్రమాద సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో అనంతపురంకి చెందిన ఎంపీ లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి కుమారి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె భర్త భాస్కర్ (51) ప్రస్తుతం రుషికేశ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
