- ఉదర సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ
- సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
- వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడి
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (78) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. నిన్న రాత్రి సోనియాగాంధీకి అస్వస్థతగా అనిపించడంతో, ఆమె వ్యక్తిగత సిబ్బంది వెంటనే స్పందించి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ఆమె ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆమెను ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చేర్పించినట్లు గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. “సోనియాగాంధీ ఉదర సంబంధిత సమస్య కారణంగా నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది” అని డాక్టర్ అజయ్ స్వరూప్ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.