Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

15 శాతానికి తగ్గనున్న ట్రంప్ టారిఫ్ లు.. అమెరికాతో భారత్ డీల్..!

  • భారత ఎగుమతులపై ప్రస్తుతం 50 శాతం వసూలు చేస్తున్న అగ్రరాజ్యం
  • త్వరలో ఇరు దేశాల మధ్య కుదరనున్న ఒప్పందం.. తగ్గనున్న సుంకాలు
  • భారతీయ మార్కెట్లలోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎంట్రీ..!

మనదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లు తగ్గనున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అవుతున్న వస్తువులపై 50 శాతం పన్ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తున్నందుకు ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు కూడా ఉన్నాయి. అయితే, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని, ఆ తర్వాత ట్రంప్ సుంకాలు 15 శాతానికి తగ్గే అవకాశం ఉందని తెలిపాయి.

రష్యా నుంచి తగ్గనున్న దిగుమతులు
ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించనుందని, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించనుందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారుపై విశ్వాసం వ్యక్తంచేశారు. 

వ్యవసాయ ఉత్పత్తుల కోసం ట్రంప్ పట్టు..
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కీలకంగా మారాయి. తమ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌ తలుపులు బార్లా తెరవాలని ట్రంప్‌ పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చర్చలు ముందుకు సాగడంలేదు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరపడంపైనా ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, ఇటీవల జరిగిన చర్చల్లో ఈ అంశాలపై పరస్పర అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

భారత మార్కెట్లలోకి అమెరికా మొక్కజొన్న
రష్యా నుంచి దిగుమతులు క్రమంగా తగ్గించడంతో పాటు అమెరికా మొక్కజొన్న, సోయామీల్‌ను కూడా భారత మార్కెట్లోకి అనుమతించే అవకాశం ఉన్నట్లు సదరు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొక్కజొన్నపై 15 శాతం దిగుమతి సుంకం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వార్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులను చైనా తగ్గించుకుంది. ఈ పరిస్థితుల్లో తమ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ట్రంప్ ప్రత్యామ్నాయంగా భారత మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. రష్యా చమురుకు బ్రేక్?

  • భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు రంగం సిద్ధం
  • భారత ఉత్పత్తులపై 50 శాతం నుంచి 15 శాతానికి సుంకాలు తగ్గించే అవకాశం
  • ఇంధనం, వ్యవసాయ రంగాలే ఈ ఒప్పందంలో కీలకం
  • రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోనున్న భారత్
  • ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఫోన్‌లో కీలక చర్చలు

భారత్, అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 50 శాతం నుంచి 15-16 శాతానికి తగ్గించే అవకాశం ఉందని ‘మింట్’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇంధనం, వ్యవసాయ రంగాలే కీలకంగా ఉన్న ఈ ఒప్పందంలో భాగంగా భారత్.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్‌లో సంభాషించారు. ఈ సంభాషణలో ప్రధానంగా వాణిజ్యం, ఇంధన అంశాలపై చర్చించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పరిమితం చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని మోదీ కూడా ట్రంప్‌తో మాట్లాడినట్లు ధ్రువీకరించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే, చర్చించిన అంశాల వివరాలను ఆయన వెల్లడించలేదు. ఉగ్రవాదంపై రెండు దేశాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ ఒప్పందంలో భాగంగా, జన్యుమార్పిడి చేయని అమెరికా మొక్కజొన్న, సోయామీల్ దిగుమతులకు భారత్ అనుమతించే అవకాశం ఉందని సమాచారం. సుంకాలు, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. ఈ నెలలో జరగనున్న ఆసియాన్ (ASEAN) సదస్సులోనే ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై తుది ప్రకటన వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వైట్ హౌస్ వెంటనే స్పందించలేదు.

Related posts

చైనా అధ్యక్షుడితో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత భేటీ

Ram Narayana

పైలట్లకు ఎతిహాద్ ఎయిర్ వేస్ హెచ్చరిక…

Ram Narayana

పాక్‌తో దోస్తీ.. తుర్కియే, అజర్‌బైజాన్‌లకు భారత పర్యాటకుల గట్టి షాక్!

Ram Narayana

Leave a Comment