Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఆఫీసుకు వెళ్లకుండానే రెండేళ్లలో రూ. 37 లక్షల జీతం.. అధికారి భార్య బాగోతం బట్టబయలు!

  • ప్రభుత్వ అధికారి భార్య పేరిట భారీగా ముడుపులు
  • ఆఫీసుకు వెళ్లకుండానే రెండేళ్లపాటు జీతం
  • దాదాపు రూ. 37.54 లక్షలు అందుకున్న భార్య
  • ప్రభుత్వ టెండర్లకు ప్రతిఫలంగా ఫేక్ ఉద్యోగం
  • భార్య ఫేక్ అటెండెన్స్‌ను ఆమోదించిన భర్త
  • హైకోర్టు ఆదేశాలతో ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన స్కామ్

రాజస్థాన్‌లో ఓ ఉన్నతాధికారి అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా తన భార్య పేరిట ఫేక్ ఉద్యోగం సృష్టించి, ఆమె ఆఫీసుకు ఒక్క రోజు కూడా వెళ్లకుండానే దాదాపు రెండేళ్లలో రూ. 37.54 లక్షల జీతం పొందేలా చేశారు. ప్రభుత్వ టెండర్లు పొందిన ప్రైవేట్ కంపెనీల నుంచి ఈ మొత్తాన్ని ముడుపుల రూపంలో స్వీకరించినట్లు తేలింది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు ప్రారంభించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళితే.. రాజ్‌కాంప్ ఇన్ఫో సర్వీసెస్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రద్యుమన్ దీక్షిత్ ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ టెండర్లు దక్కించుకున్న ఓరియన్‌ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ అనే రెండు ప్రైవేట్ కంపెనీలలో తన భార్య పూనమ్ దీక్షిత్‌ను ఉద్యోగిగా చూపించారు. టెండర్లు ఇచ్చినందుకు ప్రతిఫలంగా తన భార్యకు నెలనెలా జీతం ఇవ్వాలని ఆయనే ఆ కంపెనీలను ఆదేశించినట్లు తేలింది.

ఏసీబీ విచారణ ప్రకారం, 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ రెండు కంపెనీలు పూనమ్ దీక్షిత్‌కు చెందిన ఐదు వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి జీతం పేరుతో మొత్తం రూ. 37,54,405 జమ చేశాయి. ఈ రెండేళ్ల కాలంలో ఆమె ఆఫీసులకు ఒక్కసారి కూడా వెళ్లలేదని తేలింది. ఓరియన్‌ప్రో కంపెనీలో ఉద్యోగిగా జీతం తీసుకుంటూనే, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి ‘ఫ్రీలాన్సింగ్’ పేరుతో కూడా ఆమె చెల్లింపులు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

విచిత్రం ఏమిటంటే, ఆఫీసుకు వెళ్లకపోయినా ఆమెకు హాజరు ఉన్నట్లు చూపించిన ఫేక్ అటెండెన్స్ రిపోర్టులను భర్త ప్రద్యుమన్ దీక్షిత్ స్వయంగా ఆమోదించడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఓ ఫిర్యాదుదారు రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అసలు విషయం బయటపడింది. గతేడాది సెప్టెంబర్ 6న హైకోర్టు ఆదేశాల మేరకు, ఈ ఏడాది జులై 3న ఏసీబీ ప్రాథమిక విచారణ ప్రారంభించి ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చింది.

Related posts

పనిమనిషి నాలుకతో టాయిలెట్ శుభ్రం చేయించిన బీజేపీ బహిష్కృత మహిళా నేత అరెస్ట్!

Drukpadam

సంచలనంగా మారిన షర్మిల నిర్ణయం …చైత్ర ఇంటిముందే దీక్ష!

Drukpadam

రంజాన్ వేళ రాజస్థాన్ లో మత ఘర్షణలు ….

Drukpadam

Leave a Comment