- ఐదేళ్ల క్రితం చైనాకు నిలిచిపోయిన విమాన సర్వీసులు
- ఐదేళ్ల విరామం తర్వాత కోల్‌కతా నుంచి చైనాకు బయలుదేరి వెళ్లిన ఇండిగో విమానం
- ఇటీవలి పరిణామాలతో ఇరుదేశాల మధ్య మెరుగుపడిన ద్వైపాక్షిక సంబందాలు
ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత్ – చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థకు చెందిన విమానం 176 మంది ప్రయాణికులతో నిన్న కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుండి చైనాలోని గ్వాంగ్జౌ నగరానికి బయలుదేరింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, 2020 మార్చి వరకు ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిరాటంకంగా కొనసాగాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందడం, ఆ తర్వాత తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల ఫలితంగా భారత్ – చైనా మధ్య విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.
గత కొంతకాలంగా విమాన సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు ఇరు దేశాల అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగానే, మొదటి విమానం నిన్న కోల్‌కతా నుండి చైనాకు బయలుదేరింది. ఈ సర్వీసుల పునఃప్రారంభంతో వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయాణం సులభం కానుంది.
గ్వాంగ్జౌలో ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. స్వాగతం పలికిన చైనా
- ఐదేళ్ల విరామం తర్వాత భారత్ – చైనా మధ్య విమాన సేవలు
- కోల్‌కతా-గ్వాంగ్జౌ విమాన సేవలను ప్రారంభించిన ఇండిగో
- చైనాకు స్వాగతం పలుకుతున్నామంటూ భారత్‌లోని చైనా రాయబారి ట్వీట్
గ్వాంగ్జౌలో దిగిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులకు సోమవారం చైనా ఘనంగా స్వాగతం పలికింది. దాదాపు ఐదేళ్ల క్రితం గాల్వాన్ లోయ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్న అనంతరం ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఐదేళ్ల విరామం అనంతరం భారత్-చైనా నడుమ ఇది మొదటి విమానం.
“అక్టోబర్ 27న ఉదయం, ఇండిగో ఎయిర్‌లైన్స్ 6E1703 విమానం చైనాలోని గ్వాంగ్జౌకు సురక్షితంగా చేరుకుంది. హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం” అని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
నిన్న అర్ధరాత్రి తర్వాత కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి విమానం గాంగ్జౌకు బయలుదేరింది. మొదటి విమానం కోల్‌కతా నుంచి గాంగ్జౌకు టేకాఫ్ తీసుకుందని, నవంబర్ 11వ తేదీ నుంచి తాము కోల్‌కతా-గ్వాంగ్జౌ ఎయిర్ బస్ సర్వీసును ప్రతిరోజు నడుపుతామని ఇండిగో ప్రకటించింది.
ఈ ఏడాది ప్రారంభంలో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశమైన సమయంలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

