- మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో కుండపోత వర్షాలు
- పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం, జనజీవనం అస్తవ్యస్తం
- హనుమకొండ జిల్లాలో రికార్డు స్థాయిలో 41.9 సెం.మీ. వర్షపాతం నమోదు
- వరంగల్ నగరం జలమయం..సుమారు 45 కాలనీలను ముంచెత్తిన వరద నీరు
- లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
- వరంగల్, హనుమకొండ మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
- సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
- రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- అనేక జిల్లాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ
- అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మొంథా తుపాను అవశేషాలు తెలంగాణ రాష్ట్రంలో జల ప్రళయాన్ని సృష్టించాయి. మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన ఈ తుపాను బలహీనపడినప్పటికీ, దాని ప్రభావంతో బుధవారం పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్డు, రైలు మార్గాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సిరిసిల్ల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.9 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 20.5 సెం.మీ. కంటే ఎక్కువ, 68 ప్రాంతాల్లో 11.5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం పడినట్లు తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సొసైటీ వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. హనుమకొండ బస్టాండ్ పూర్తిగా నీట మునిగి ఓ చెరువును తలపించింది.
ఈ జల విలయంలో పలు విషాద ఘటనలు, సహాయక చర్యలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లాలో ఓ డీసీఎం వాహనం డ్రైవర్‌తో సహా వరదలో కొట్టుకుపోయింది. వికారాబాద్ జిల్లాలో కాగ్నా నదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల భవనాన్ని వరద చుట్టుముట్టడంతో, అందులో చిక్కుకున్న 500 మంది విద్యార్థులను పోలీసులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
వరంగల్‌పై మొంథా తుపాను ప్రళయం.. జలదిగ్బంధంలో నగరం!

చారిత్రక నగరం వరంగల్‌ను మొంథా తుపాను అతలాకుతలం చేసింది. బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి నగరం నీట మునిగింది. ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టినా వరద ఉద్ధృతి తగ్గకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరద నీటిలో 45 కాలనీలు
నగరంలోని 45 కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్‌ఎన్ నగర్, మైసయ్యనగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 30 కాలనీలు పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. పడవల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరంగల్ తూర్పులో ఆరు సహా నగరవ్యాప్తంగా మొత్తం 12 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1200 మంది బాధితులను ఈ శిబిరాలకు తరలించారు.
భారీ వర్షాల కారణంగా హంటర్‌రోడ్డులోని బొందివాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ములుగు వెళ్లే రహదారిపై కూడా నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అత్యవసర సహాయం కోసం వరంగల్ బల్దియా కార్యాలయంలో 1800 425 1980 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. డీఆర్‌ఎఫ్, ఇంజినీరింగ్, శానిటరీ సిబ్బందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
వరదల తీవ్రత దృష్ట్యా, ముందుజాగ్రత్త చర్యగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాలల్లో జరగాల్సిన ఎస్‌ఏ-1 పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) వెల్లడించారు.
డ్రైనేజీ పాలైన ధాన్యం.. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న మహిళా రైతు..!

––
మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం తడిసిపోయింది. వరద నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో అమ్మకానికి తెచ్చిన ధాన్యం డ్రైనేజీ పాలైంది. వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. డ్రైనేజీలో నుంచి ధాన్యాన్ని ఎత్తిపోస్తూ ఓ మహిళా రైతు గుండెలు బాదుకోవడం చూపరుల కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట డ్రైనేజీ పాలైందని మహిళా రైతు ఆవేదన చెందుతూ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. మార్కెట్ ను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ కాళ్లు మొక్కుతూ న్యాయం చేయాలని వేడుకుంది.
అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, జలాశయాల వద్ద నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖకు సూచించారు. జలాశయాల నుంచి నీరు విడుదల చేసే ముందు స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నందున, సహాయక చర్యల కోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలను రంగంలోకి దించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ (IMD) పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. వరంగల్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పెళ్లిళ్లలో వృథా అయ్యే భోజనాన్ని పంపించండి: వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్
- వరంగల్ నగరంలో నీట మునిగిన పలు ప్రాంతాలు
- డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందజేత
- పెళ్లిళ్లలో భోజనం వృథా చేయకుండా బాధితులకు పంపించాలని వీడియో విడుదల
మొంథా తుపాను ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
వరంగల్ నగరంలో ఈ రోజు చాలా వివాహాలు జరుగుతున్నందున, మిగిలిపోయిన భోజనాన్ని వరదల్లో చిక్కుకున్న బాధితులకు అందజేయాలని ఆయన కోరారు. భోజనం సేకరించేందుకు తమ బృందం సిద్ధంగా ఉంటుందని, సమాచారం అందిస్తే ఆ భోజనాన్ని వృథా చేయకుండా బాధితులకు అందజేస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా, వరంగల్ నగరంలోని 470 మంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారు రాత్రి నుండి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. స్పందించిన రెస్క్యూ సిబ్బంది వారిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరంగల్‌లో ముంపు ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్య శారద పర్యటించారు.

