సామినేని రామారావు మృతిపై న్యాయమైన విచారణ జరగాలి.
- విచారణపై రాజకీయ వత్తిళ్లు సరికాదు.
- 4, 5 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు.
- సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు
సిపిఎం సీనియర్ నాయకులు సామినేని రామారావు మృతి పైన న్యాయమైన విచారణ జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావులు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతీ అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవనం నందు జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు లు మాట్లాడుతూ పాతర్లపాడు గ్రామంలో సిపిఎం ఎదుగుదలను చూసి ఓర్వలేక, సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ గ్రామంలో సీపీఐ (ఎం) విజయం సాధించకూడదు అని రాజకీయంగా దుర్బుద్దితో హత్యకు పాల్పడ్డారని అన్నారు. పచ్చని పల్లెలో సుపారి ఇచ్చి మర్డర్లు చేయించే సంస్కృతికి నాంది పలకడం సిగ్గుచేటు అన్నారు. ఇట్లాంటి సంస్కతి పైన జిల్లాలోని ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారని, ఇలాంటి చర్యలకు పూనుకుంటున్న వారికి, ప్రోత్సహిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని వారు అన్నారు. పాతర్లపాడులో కాంగ్రెస్ గూండాలు రామారావుపై దాడి చేసి, కత్తితో పొడవడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. సామినేని హత్యకు బాధ్యులైన వారిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, హేయమైన ఈ నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టి తగు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేసింది. జిల్లా పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. సామినేని రామారావు హత్య కేసులో రాజకీయ ఒత్తిడిలు సరికాదన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం రాజకీయ ఒత్తిడిలకు లోన్ అవుతున్నట్టుగా అనిపిస్తుందని తెలిపారు. పోలీసులు బాధిత కుటుంబాన్ని విచారిస్తున్న తీరు చూస్తుంటే కేసును పక్కదారి పట్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయన్నారు. విచారణ పేరుతో బాధిత కుటుంబంపై పోలీసులు అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. హత్య చేసిన వారిపై కాకుండా బాధిత కుటుంబంపై విచారణ చేపట్టడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటివరకు ఫిర్యాదు మోపబడిన వారిని అరెస్టు చేయకపోవడం, సరైన విచారణ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ హత్యను ప్రజాస్వామ్య వాదులంతా ముక్తకంఠంతో ఖండిరచాలని కోరారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా సామినేనిని హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 4, 5 తేదీల్లో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, కళ్యాణ వెంకటేశ్వరరావు, వై విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం కార్యదర్శ వర్గంలోకి ఇద్దరికి చోటు :
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్న యర్రా శ్రీకాంత్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని మధిర డివిజన్ సిపిఎం కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మెరుగు సత్యనారాయణలతో భర్తీ చేశారు. వీరిరువురిని ఆదివారం జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గానికి ఎన్నిక చేశారు.
సామినేని రామారావుది ముమ్మాటికి రాజకీయ అత్యే.. నున్నా నాగేశ్వరరావు
నిందితులను ఎందుకు విచారించటం లేదు, ఎందుకు అరెస్టు చేయటం లేదు
పోలీసులు విచారణ పేరుతో రామారావు కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు
మాకు డిప్యూటీ సీఎం అండ ఉందని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు
డిప్యూటీ సీఎం అండ ఉందని సిపిఎం అనటం లేదు
రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి
కాంగ్రెస్ నాయకులు గ్రామం నుంచి రాష్ట్రం వరకు తప్పుడు ప్రచారానికి దిగారు

మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ రాష్ట్ర నాయకులు సామినేని రామారావుది ముమ్మాటికి రాజకీయ హత్యేనని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామినేని రామారావుని రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ గుండాలు హత్య చేశారని స్పష్టం చేశారు. సామినేని రామారావు భార్య స్వరాజ్యం తన భర్తను కాంగ్రెస్ కు చెందిన వారే హత్య చేశారని తాను హత్య చేసేటప్పుడు స్వయంగా చూశానని పేర్లతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై ఎటువంటి విచారణ చేయకుండా, అరెస్టు చేయకుండా కేవలం రామారావు కుటుంబ సభ్యులను విచారణ పేరుతో పోలీసులు వేధింపులకు ఎందుకు గురి చేస్తున్నారో పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సామినేని రామారావు హత్య తర్వాత ఆ కుటుంబం తీవ్ర బాధలో ఉండగా పదేపదే కుటుంబ సభ్యులను పోలీసులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు డిప్యూటీ సీఎం అండ ఉందని రామారావు హంతకులే ప్రచారం చేసుకుంటున్నారని, సిపిఎం ప్రచారం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. లేకపోతే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు సామినేని రామారావు హత్యపై పదే పదే తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పదేపదే తప్పుడు ప్రచారం చేయవలసిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రామారావు హత్య జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రామారావు హత్యను ఖండిస్తూ హైదరాబాదులో ప్రకటన చేయటంలో అసలు విషయం దాగి ఉందన్నారు. ఆ వెంటనే గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం పెట్టి తప్పుడు ప్రచారం ఎందుకు చేయవలసిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. రామారావు భార్య స్వరాజ్యం ఫిర్యాదులో పేర్కొన్న వారిని పోలీసులు ఎందుకు విచారణ చేయటం లేదో జరుగుతున్న పరిణామాలు బట్టి తమక స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. రామారావు హత్యను పక్కదారి పట్టించేందుకు పోలీసుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే పోలీసులు రామారావు కుటుంబాన్ని విచారణ అంటూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు పదేపదే రామారావు హత్య ఆస్తి తగాదాల, కుటుంబ గొడవల వలన జరిగిందని ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.పోలీసులు కూడా అదేవిధంగా విచారణ కొనసాగిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి రామారావు హత్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సామినేని రామారావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ నాయకులు పదేపదే ఓ మీడియా సంస్థ ద్వారా తప్పుడు కథనాలు వ్రాయిస్తున్నారని విమర్శించారు. సామినేని రామారావు రాజకీయాలలో చాలా చురుకుగా, కీలకంగా వ్యవహరిస్తున్నాడని ఆయన స్పష్టం చేశారు. పాతర్లపాడు గ్రామంలో సామినేని రామారావు సిపిఎం కు అత్యంత ప్రధాన నాయకుడు అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టే విక్రమార్క హంతకులకు అండగా ఉంటున్నాడనే అనుమానాలు జరుగుతున్న పరిణామాల బట్టి అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా పోలీసులు విచారణ నిర్వహిస్తే సిపిఎం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.
నిందితుల ఫోన్లను పోలీసులు నేటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారేమైనా దేశము విడిచి పారిపోయారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల, వారి ప్రోత్సాహం, సహకారంతోనే రామారావు ని హత్య చేశారని ఆయన స్పష్టం చేశారు. రామారావు హత్య కంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారానికి దిగారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించకుండా, అనుమానితులను, నిందితులను విచారించి, అరెస్టు చేయకుండా కేసును తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే సిపిఎం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొన్నం వెంకటేశ్వరరావు మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మండల కార్యదర్శి రాచబంటి రాము వత్సవాయి జానకి రాములు తోటకూరి వెంకట నరసయ్య బల్లి వీరయ్య గడ్డం కోటేశ్వరరావు దేశ బోయిన ఉపేందర్ ఆలస్యం రవి కాటబత్తిని వీరబాబు లింగం కోటి కిలారు కిరణ్ నన్నక కృష్ణమూర్తి వాకా సీతారామరెడ్డి చందర్రావు గడ్డం మద్దిని బసవయ్య రమణ తదితరులు పాల్గొన్నారు ..

