
- మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు
- ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం
- బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) హాఫ్ సెంచరీలు
- బౌలింగ్‌లో 5 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించిన దీప్తి శర్మ
- సఫారీ కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) అద్భుత సెంచరీ వృథా
- భారత ఆల్‌రౌండర్ల ప్రదర్శనతో సొంతమైన ప్రపంచ టైటిల్
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌కు, చివర్లో దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన తోడవడంతో భారత్ జగజ్జేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ వీరోచిత సెంచరీ చేసినా, తన జట్టును గెలిపించలేకపోయింది.
ఈ మెగా ఫైనల్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్, ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధన (45), షఫాలీ వర్మ (87) అద్భుతమైన శుభారంభం అందించారు. ముఖ్యంగా షఫాలీ తనదైన శైలిలో దూకుడుగా ఆడి కేవలం 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాది వేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) త్వరగానే వెనుదిరిగినా, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. చివరి ఓవర్లలో వికెట్ కీపర్ రిచా ఘోష్ (24 బంతుల్లో 34) మెరుపులు మెరిపించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో అయాబొంగా ఖాకా 3 వికెట్లు పడగొట్టింది.
299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) ఒంటరి పోరాటం చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఆమె మాత్రం అద్భుతమైన షాట్లతో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచింది. కేవలం 98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి ఆమెకు సరైన సహకారం అందలేదు. సఫారీ ఇన్నింగ్స్‌లో అనెరీ డెర్క్‌సెన్ (35) మినహా ఎవరూ రాణించలేకపోయారు.
ఈ దశలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బంతితో మ్యాజిక్ చేసింది. కీలకమైన వోల్వార్ట్ వికెట్‌తో సహా మొత్తం 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. ఆమె అద్భుతమైన బౌలింగ్‌కు సఫారీ బ్యాటర్లు నిలవలేకపోయారు. దీప్తికి తోడుగా షఫాలీ వర్మ కూడా 2 కీలక వికెట్లు తీసి తన ఆల్‌రౌండ్ సత్తాను చాటింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత అమ్మాయిలు 52 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుని ప్రపంచకప్‌ను గర్వంగా ముద్దాడారు.
2005, 2017 వన్డే వరల్డ్ కప్ లలో టీమిండియా అమ్మాయిలు ఫైనల్ చేరినా, కప్ దక్కించుకోలేకపోయారు. ఇప్పుడా లోటును తీర్చుతూ, చారిత్రక విజయం నమోదు చేశారు.
ఈ విజయం దేశంలోని భవిష్యత్ ఛాంపియన్లకు ప్రేరణ: ప్రధాని మోదీ

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో భారత క్రీడాకారిణుల ప్రదర్శన అత్యుత్తమ నైపుణ్యం, గొప్ప ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని ఆయన కొనియాడారు.
ఈ చారిత్రక విజయంపై ప్రధాని స్పందిస్తూ, “టోర్నమెంట్ ఆద్యంతం మన జట్టు అసాధారణమైన టీమ్‌వర్క్, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారిణులకు నా అభినందనలు” అని పేర్కొన్నారు. భారత మహిళల జట్టు కనబరిచిన స్ఫూర్తిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ గెలుపు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదని, దేశంలోని భవిష్యత్ ఛాంపియన్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. “ఈ చారిత్రక విజయం, క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి యువతను మరింత ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు. భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
దశాబ్దాల కల నెరవేరింది… భారత మహిళా క్రికెటర్లను కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి

ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్‌లో చారిత్రక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన తుది పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచి, ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత క్రీడాకారిణులు ప్రదర్శించిన మొక్కవోని పట్టుదల, ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని కొనియాడారు. జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వ పటిమను, ఫైనల్‌లో జట్టు కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
“ఈ విజయంతో దశాబ్దాల కల నెరవేరింది. భారత మహిళా జట్టు సాధించిన ఈ అద్భుతమైన ఘనతకు యావత్ దేశం గర్విస్తోంది. మన క్రీడాకారిణులు ప్రదర్శించిన పోరాట పటిమ, క్రీడాస్ఫూర్తి దేశవ్యాప్తంగా వర్ధమాన క్రికెటర్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో మన జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు భారత మహిళల జట్టుకు, బీసీసీఐకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
మన అమ్మాయిలు దేశం మొత్తం గర్వపడేలా చేశారు: సీఎం చంద్రబాబు

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. యావత్ దేశం గర్వపడేలా మన అమ్మాయిలు అద్భుతమైన ఘనతను సాధించారని కొనియాడారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా జట్టుకు తన అభినందనలు తెలిపారు.
“భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. మన అమ్మాయిలు దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వారి అద్భుతమైన ప్రదర్శన, అలుపెరుగని పట్టుదల, తిరుగులేని పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చాయి. ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచారు” అని చంద్రబాబు పేర్కొన్నారు.
2025 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్వితీయమైన విజయం సాధించి భారత జట్టు కప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక సందర్భంలో జట్టు సభ్యులకు, సహాయక సిబ్బందికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “మన ఛాంపియన్లకు నా హృదయపూర్వక అభినందనలు” అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు.
ఇండియా ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్… ఆమెకు స్పెషల్ సెల్యూట్: మంత్రి నారా లోకేశ్

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించిందని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
“భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్! ఇది చారిత్రక రాత్రి. మన ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అసాధారణమైన పట్టుదల, గుండె ధైర్యంతో ప్రపంచకప్‌ను సాధించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించారు” అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
భారత విజయానికి బాటలు వేసిన కీలక క్రీడాకారిణులను లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. “మెరుపు ఇన్నింగ్స్‌తో 87 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసిన షెఫాలీ వర్మకు స్పెషల్ సెల్యూట్. అలాగే, ఒత్తిడిలో అద్భుతమైన ఆల్-రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తి శర్మ ఛాంపియన్ అని నిరూపించుకుంది” అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారిణి శ్రీ చరణిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి పేరు గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది” అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం రాబోయే తరానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. “జై హింద్!” అంటూ తన పోస్టును ముగించారు.
అమన్‌జోత్ ఆ క్యాచ్ వదిలుంటేనా…!

ఒక్కోసారి క్రికెట్‌లో కొన్ని క్షణాలు ఆటను మించి చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒకవేళ ఆ క్యాచ్ జారి ఉంటే? బహుశా కోట్లాది మంది భారతీయుల ప్రపంచకప్ కల చెదిరిపోయేదేమో! దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ అజేయమైన శతకంతో క్రీజులో పాతుకుపోయి, తమ జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించిన తరుణంలో… అమన్‌జోత్ కౌర్ చేసిన ఆ ఫీల్డింగ్ విన్యాసం టీమిండియా తలరాతనే మార్చేసింది.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా విజయానికి చేరువవుతున్న సమయంలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ ఆశలపై నీళ్లు చల్లుతున్నట్లు కనిపించింది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను కట్టడి చేయలేకపోయారు. మ్యాచ్ దాదాపుగా భారత్ చేజారిపోతోందన్న నిరాశ అభిమానుల్లో అలుముకుంది.
అప్పుడే లారా మరో భారీ షాట్‌కు ప్రయత్నించింది. బంతి గాల్లోకి లేచి బౌండరీ లైన్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అమన్‌జోత్ కౌర్ కొద్దిగా తడబాటుకు గురైంది. రెండుసార్లు చేజారిన బంతిని మూడో ప్రయత్నంలో ఒక్క చేత్తో ఒడిసిపట్టింది. ఆ ఒక్క క్యాచ్‌తో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తింది. దక్షిణాఫ్రికా శిబిరంలో నిశ్శబ్దం ఆవరించగా, భారత క్రీడాకారిణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దక్షిణాఫ్రికా పతనానికి ఆ క్యాచ్ నాంది పలికింది.
ఆ తర్వాత భారత బౌలర్లు చెలరేగి దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. ఫలితంగా, ఫైనల్లో 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, భారత మహిళల జట్టు తమ మొట్టమొదటి వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.
సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
అమన్‌జోత్ క్యాచ్ పట్టిన వెంటనే సోషల్ మీడియా షేక్ అయింది. #AmanjotKaur, #TeamIndia, #WorldCupFinal అనే హ్యాష్‌ట్యాగ్‌లు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. “ఆమె కేవలం క్యాచ్ పట్టలేదు, మా హృదయాలను గెలుచుకుంది” అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. మాజీ క్రికెటర్లు, ప్రముఖులు సైతం అమన్‌జోత్ ను కొనియాడారు. ఈ ఒక్క క్షణం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా నిలిచిపోయింది.

