Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కిల్లర్ రూపంలో వచ్చిన టిప్పర్ …19 మంది బలి..మరికొందరి పరిస్థితి సీరియస్

ఇటీవల జరుగుతున్న వరస రోడ్ ప్రమాదాలు ప్రయాణికులను కలవరానికి గురి చేస్తున్నాయి…వారం రోజుల క్రితం హైద్రాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న బస్సు కు కర్నూల్ వద్ద జరిగిన ఘోర రోడ్ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు మంటల్లో బుగ్గి అయిపోయాయి..ఆ సంఘటన మరవక ముందే సోమవారం రోజున తాండూర్ నుంచి హైద్రాబాద్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సును చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద కంకర లోడ్ తో ఎదురుగ వస్తున్నా టిప్పర్ ఢీకొనడంతో 19 మంది స్పాట్ లో చనిపోగా మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు …కంకర లోడుతో వస్తున్నటిప్పర్ బస్సును ఢీకొట్టడమే కాకుండా అందులో ఉన్న కంకర బస్సు లో ఉన్న ప్రయాణికులపై పడి అందులో కూరుకొని పోయి ప్రాణాలు విడిచారు..ఈ సంఘటన తో అక్కడ అహకారాలు మిన్నంటాయి.. ఒక తల్లి చనిపోగా అభం శుభం తెలియని 10 నెలల పసిబిడ్డ చూపులు అందరిని కన్నీరు పెట్టించాయి..మరో దంపతులు మృతి తీరని శోకంగా మిగిలింది ..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెల్లు బస్సు లో హైద్రాబాద్ కు వెళుతూ మృత్యువాత పడటంతో ఆ తండ్రి రోదనలు ఆపడం ఎవరు తరం కాలేదు ..ముగ్గురు విద్యార్థునిలే …ఇద్దరు డిగ్రీ చదువుతుండగా , ఒకరు ఎంబీఏ చేస్తున్నారు ..రైలుకు వెళ్లాల్సిన వారు అది వెళ్లి పోవడంతో సోమవారం కాలేజీకి వెళ్లాలని వేకువ జామునే లేచి తల్లి ,దండ్రులకు నవ్వుతు బై బై చెప్పి బస్సు వెక్కారు.. అవే చివరి బై బై లు అవుతాయని ఊహించని ఆ తండ్రి రోదనలు పలువురిని కదిలించాయి…ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్కరిది ఒక కథ …మొత్తానికి కిల్లర్ టిప్పర్ ఇలా పొట్టన పెట్టుకుంది ..బస్సు డ్రైవర్ తో సహా కుడి పక్కన ఉన్నవాళ్లు చనిపోగా ఎడమ పక్క కూర్చన్నవాళ్ళు అనేక మంది బతికి బయట పడ్డారు ..

తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన లారీ, బస్సుపై బోల్తా పడింది. లారీలోని కంకర మొత్తం ప్రయాణికులపై పడటంతో చాలామంది దాని కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి, తిరిగి హైదరాబాద్‌లోని కార్యాలయాలు, కళాశాలలకు వెళ్తున్న వారే వీరిలో అధికంగా ఉన్నారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం హృదయవిదారకంగా మారింది.

మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్ సహా 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు జేసీబీల సహాయంతో కంకరను తొలగించి, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు కండక్టర్ రాధ సహా 15 మందిని సురక్షితంగా కాపాడారు. ఈ క్రమంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కూడా గాయపడ్డారు.

క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. మృతులందరి పోస్టుమార్టం ఉస్మానియా ఆసుపత్రిలో ఒకేచోట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

టిప్పర్ అతి వేగం వల్లే: చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ప్రకటన

Telangana RTC Statement on Chevella Bus Accident Tipper Speed Blamed

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది. టిప్పర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆర్టీసీ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రోడ్డు మలుపు వద్ద టిప్పర్ అతి వేగంగా ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపింది.

ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గానీ, బస్సు డ్రైవర్ గానీ కారణం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని, డ్రైవర్ సర్వీసు రికార్డులో గతంలో ఎలాంటి ప్రమాదాలు లేవని వెల్లడించింది. టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పేర్కొంది. టిప్పర్ బలంగా ఢీకొనడంతో బస్సు ముందు భాగంతో పాటు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది.

ఢీకొట్టిన టిప్పర్ బస్సు వైపు ఒరిగిపోవడంతో, అందులోని కంకర ప్రయాణికులపై పడి ఊపిరాడక మృతి చెందారని వెల్లడించింది. విషయం తెలియగానే ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారని తెలిపింది.

చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియో ప్రకటన

PM Modi Expresses Grief Over Rangareddy Road Accident

ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ప్రమాద వార్త తెలియగానే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

రంగారెడ్డి ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు

Revanth Reddy Shocked by Rangareddy Accident Orders Key Officials

రంగారెడ్డి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలియగానే ఆయన తక్షణమే స్పందించి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఉన్నతాధికారులను సూచించారు.

క్షతగాత్రుల ప్రాణాలు కాపాడటమే ప్రథమ కర్తవ్యమని సీఎం స్పష్టం చేశారు. గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించి, అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరారు. బాధితుల కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పరిస్థితి విషమంగా ఉన్న వారిని కాపాడేందుకు నిపుణులైన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనను ఒక ‘హెల్త్ ఎమర్జెన్సీ’ తరహాలో పరిగణించి, అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రమాదంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకోవాలని ఆదేశించారు. మరోవైపు, ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు నారా లోకేశ్ పేర్కొన్నారు.

ప్రమాదానికి అదీ కారణమే: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar on Chevella Road Accident Reasons

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని చెప్పారు. బస్సు దుర్ఘటనపై ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వరుస ప్రమాదాలు, నివారణ చర్యలపై జూమ్ వేదికగా ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉందని చెప్పారు. అయితే అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని అభిప్రాయపడ్డారు. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతుందో చూడాలని అన్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలని అధికారులకు సూచించారు.

రవాణా శాఖ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీరియస్‌గా, క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. లారీలు ఇసుక, డస్టును తరలిస్తే టార్పాలిన్లు కప్పేలా చూసుకోవాలని సూచించారు. రైతులు ధాన్యం తరలిస్తే వేధింపులకు పాల్పడవద్దని సూచించారు. వాణిజ్య, సరుకు రవాణా, ప్రయాణికుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.

ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు చేయడం కాదని, నిరంతరం కార్యాచరణ ప్రణాళిక ఉండేలా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రవాణా శాఖ పట్ల ప్రజలకు, ప్రభుత్వంలో గౌరవం పెంపొందించేలా ఉద్యోగులు పనిచేయాలని అన్నారు.

అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చని మంత్రి అన్నారు. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు, కార్గో సరుకులు తరలిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాబోయే రోడ్డు భద్రతా మాసంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అన్నారు.

రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరగవు: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు

Mallu Ravi comments on Chevella bus accident cause

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. రోడ్లు బాగాలేకపోవడం వల్లనో, కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయకపోవడం వల్లనో ప్రమాదాలు జరగవని ఆయన స్పష్టం చేశారు.

గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ప్రమాదాలు రెగ్యులర్ గా జరుగుతుంటాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగి మరణించిన సందర్భాలు లేవా అని ఆయన ప్రశ్నించారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎంతో బాగున్నప్పటికీ, ఓఆర్‌ఆర్‌‌పై ఎన్నో ప్రమాదాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. “రోడ్డు బాగుందా లేదా అనే దాని వల్ల ప్రమాదాలు జరగవు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారు, మా ప్రభుత్వంలోనూ చనిపోయారు” అని ఆయన అన్నారు. ప్రమాదాన్ని తాము సమర్థించడం లేదని, అలా జరగకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దుర్ఘటనను రాజకీయాలకు ఉపయోగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన చోట.. ఎమ్మెల్యేపై దాడికి యత్నం!

Kaale Yadaiah Faces Protest at Chevella Bus Accident Site

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు బస్సు ప్రమాద స్థలిలో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి 163పై రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుపై కంకర లోడుతో వెళుతున్న లారీ పడిపోవడంతో 19 మంది ప్రయాణీకులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ ప్రాంతానికి కాలే యాదయ్య రాగా, ప్రయాణికులు ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ, ఆయనపై దాడికి యత్నించారు. వారి నిరసనతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ప్రమాదం చాలా బాధాకరమని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రహదారి మంజూరై ఆరేడు సంవత్సరాలు అవుతోందని తెలిపారు. ఈ రోడ్డు చాలా చిన్నగా ఉందని, ఈ ప్రాంతంలో ఎన్నోమార్లు ప్రమాదాలు జరిగాయని అన్నారు. రోడ్డు సన్నగా ఉండటం వల్ల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీటీలో కేసుల వేసిన కారణంగా రోడ్డు వెడల్పు ఆలస్యమవుతోందని అన్నారు.

టిప్పర్ వేగంగా వచ్చి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిందని తాండూరు బస్ డిపో మేనేజర్ తెలిపారు. ఉదయం 7.05 గంటలకు ప్రమాదం జరిగిందని, టిప్పర్‌లో సుమార్ 50 టన్నుల కంకర ఉన్నట్లు వెల్లడించారు. గుంతను తప్పించబోయి టిప్పర్ బస్సును ఢీకొన్నట్లు తెలిసిందని తెలిపారు.

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటనా స్థలానికి వచ్చిన రాజకీయ నాయకుల ఘెరావ్

Chevella Accident Political Leaders Confronted by Victims Families

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. 

ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రమాదం జరిగిన చాలాసేపటి తర్వాత ఎమ్మెల్యే కాలె యాదయ్య ఘటనా స్థలానికి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గతంలో ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ప్రజల నిరసనల మధ్యే ఎమ్మెల్యే కాలె యాదయ్య అక్కడి నుంచి వెనుదిరిగారు. 

అలాగే, చేవెళ్ల ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని బాధితులు ఘెరావ్ చేశారు. ఈ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ ప్రమాద తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగింది: బస్సు ప్రమాదంపై కండక్టర్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై బస్సు కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీర్జాగూడ వద్దకు బస్సు రాగానే ఏం జరుగుతుందో క్షణంపాటు అర్థం కాలేదని, కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ, బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన తెలిపారు.

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి 163పై మీర్జాగూడ వద్ద ఈ రోజు ఉదయం తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు.

ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బండప్ప, లక్ష్మీ దంపతులు మృతి చెందారు. దీంతో వారి కుమార్తెలు భవాని, శివలీల అనాథలయ్యారు. తల్లిదండ్రుల మరణంతో ఆ చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటంతో అక్కడున్న వారి హృదయాలు బరువెక్కాయి.

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు…

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్జాగూడ సమీపంలో వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లతో సహా మొత్తం 19 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై సైబరాబాద్ సీపీ మహంతి స్పందించారు. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మరణించడంతో తప్పు ఎవరిదనేది ఇప్పుడే నిర్ధారించలేమని తెలిపారు. బస్సును ఢీకొట్టిన తర్వాత టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సులోకి పడటంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఆయన వివరించారు. మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే శవపరీక్షలు నిర్వహిస్తున్నామని, అనంతరం మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తున్నామని వెల్లడించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్లు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్‌ను మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌ కాంబ్లేగా గుర్తించారు. పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి కంకర లోడుతో వికారాబాద్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం.. ఘటనపై విచారణకు ఆదేశం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar Orders Investigation into Chevella Accident

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆయన రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

రహదారిపై ఉన్న ఓ గుంతను తప్పించే ప్రయత్నంలో టిప్పర్ లారీ అదుపుతప్పి రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో హృదయ విదారక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. 

చేవెళ్ల ఘోర ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ప్ర‌భుత్వం రూ.5 లక్షల పరిహారం

Ponnam Prabhakar Announces Compensation for Chevella Accident Victims

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం ప్రకటించింది. ఈ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు చెప్పారు.

మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సకాలంలో అప్పగించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని ఆయన వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలా బాధితులకు సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

చేవెళ్ల బస్సు ప్రమాదంలో టీచర్ నరకయాతన

Chevella Bus Accident Teacher Jayasudha injured
  • టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులోకి..!
  • నడుములోతు కంకరలో ఇరుక్కున్న టీచర్
  • జేసీబీతో వెలికి తీసి ఆసుపత్రికి తరలించిన రెస్క్యూ టీమ్

చేవెళ్లలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడింది. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు ఆర్తనాదాలు చేయడం స్థానికులను కంటతడి పెట్టించింది. 

తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్‌ కాంట్రాక్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధతో పాటు మరికొందరు నడుములోతు కంకరలో ఇరుక్కుని బయటకు రాలేకపోయారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబసభ్యులు నిమ్స్‌కు తరలించారు.

కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులూ అదే బస్సులో రావాల్సింది. ఆలస్యంగా రావడంతో వారు ఈ బస్సును అందుకోలేకపోయారు. వేరే బస్సులో బయలుదేరడంతో వారంతా ప్రమాదం తప్పించుకున్నారు.

చేవెళ్ల బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu Condolences for Chevella Accident Victims

చేవెళ్లలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో బస్సు, టిప్పర్ డ్రైవర్లు సహా 19 మంది మరణించగా.. 42 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం అధికారులు వారిని హైదరాబాద్ లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించారు.

ఘోర బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ స్పందన

KCR KTR React to Rangareddy Bus Accident Tragedy

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై కేసీఆర్ స్పందిస్తూ… ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కోరారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన తీరు కలచివేసిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందడం, అనేక మంది గాయపడటం పట్ల సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

తెలంగాణాలో ఐదుగురు పోలీస్ సర్కిల్ ఇన్సపెక్టర్లపై చర్యలు ….పోలీస్ శాఖలో కలకలం

Ram Narayana

మేడారం జాతర తేదీలు ఖరారు .. జనవరి 28 నుంచి మహా వేడుక!

Ram Narayana

మూసీ పునర్జీవం అధ్యయనానికి మంత్రులు పొంగులేటి, పొన్నం దక్షణ కొరియా పర్యటన

Ram Narayana

Leave a Comment