- మా హయాంలో బకాయిలు ముందుగా చెల్లిస్తామని వెల్లడి
- విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి
- కాలేజీలు బంద్ పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా అని నిలదీత
- వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని ఎలా నడపాలని ప్రశ్న
ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యాసంస్థలు చేపట్టిన బంద్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అడ్డగోలుగా ఫీజులు పెంచుకుని వచ్చి రీయింబర్సుమెంట్ అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. తమ హయాంలోని బకాయిలు ముందుగా చెల్లిస్తామని, విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆటలు ఆడవద్దని విజ్ఞప్తి చేశారు.
బకాయిలు ఈరోజు కాకుంటే రేపు వస్తాయని, కానీ కాలేజీలు బంద్ పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులకు ఇబ్బంది లేదని అన్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని అన్నారు. రాష్ట్రానికి నెలకు రూ. 18 వేల కోట్ల ఆదాయం వస్తోందని, వేతనాలు, వడ్డీలు, ఇతర ఖర్చులు పోను మిగిలేది రూ. 5 వేల కోట్లే అన్నారు.
ఈ ఆదాయంతో రాష్ట్రాన్ని ఎలా నడపాలో చెప్పండని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలను బంద్ చేయించిన వారితో చర్చించడానికి ఏముంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏ కాలేజీ ఎంత డొనేషన్ వసూలు చేస్తుందో తనకు తెలుసని అన్నారు. కాలేజీలు నిబంధనలు పాటించాలని అన్నారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు.
విద్య వ్యాపారం కాదని, సేవగా భావించాలని సూచించారు. రాజకీయ నేతలు అండగా ఉన్నారని విద్యార్థులతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కాలేజీలకు అనుమతుల విషయంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. కాలేజీల యజమానులు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తారా? అని నిలదీశారు. ఆర్. కృష్ణయ్య కూడా వారి ఉచ్చులో పడ్డారని విమర్శించారు. ఆర్. కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ ముందుకొస్తే వారి చేతికే చిట్టా ఇస్తానని అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చర్చలు సఫలం.. బంద్ విరమించిన ప్రైవేటు కాలేజీలు
- ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలం
- బకాయిలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో యాజమాన్యాల భేటీ
- రూ. 600 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి
- బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించిన విద్యా సంస్థల సమాఖ్య
ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది.
ప్రైవేటు కళాశాలలకు ఫీజు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తక్షణమే రూ. 600 కోట్ల విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మరో రూ. 300 కోట్లు త్వరలో చెల్లించడానికి హామీ ఇచ్చారు. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు ఈ నెల 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి. ప్రభుత్వంతో కళాశాల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు రేపటి నుంచి తెరుచుకోనున్నాయి.