- ఘట్‌కేసర్‌లో ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
- అంతిమ సంస్కారాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు
- అందెశ్రీ లేకపోవడం తీరని లోటు అన్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివారులోని ఘట్‌కేసర్‌లో నిర్వహించారు. ఈ అంతిమ సంస్కారాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంతిమ యాత్రలో అందెశ్రీ పాడెను రేవంత్ రెడ్డి మోశారు.
తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందెశ్రీ అంత్యక్రియల అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
వ్యక్తిగతంగా, తెలంగాణ సమాజానికి లోటు: రేవంత్ రెడ్డి
అందెశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు, తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రం గురించి అనేక విషయాలు ఆయనతో చర్చించినట్లు తెలిపారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్రగీతంగా నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందెశ్రీ ప్రతి మాట ప్రజా జీవితం నుంచి పుట్టుకు వచ్చిందని అన్నారు. ప్రతి పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిందని అన్నారు.
‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడు ఆయన అని అన్నారు. ఆయన రచనలకు సంబంధించిన ‘నిప్పులవాగు’ పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని అన్నారు.
అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి… ప్రధానిని కోరతా: సీఎం రేవంత్ రెడ్డి

- అందెశ్రీ కీర్తిని శాశ్వతం చేస్తామన్న రేవంత్
- ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ
- ఆయన మరణం ఆప్తుడిని కోల్పోయిన బాధను కలిగించిందని వ్యాఖ్య
ప్రముఖ రచయిత, జన వాగ్గేయకారుడు అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన సీఎం, అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆయన కీర్తిని శాశ్వతం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అందెశ్రీకి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. “అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాను. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ విషయంపై వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తాను. ఇందుకు కేంద్ర మంత్రులు కూడా సహకరించాలి” అని ఆయన కోరారు. తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ పేరు నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. “రాజకీయ నేతలను నేరుగా కలవనని చెప్పిన అందెశ్రీ గారితో మీడియా ద్వారానే పరిచయం ఏర్పడింది. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఒక ఆప్తుడిని కోల్పోయిన బాధను మిగిల్చింది” అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “జీవితాంతం తెలంగాణ కోసం తపించిన గొప్ప వ్యక్తి ఆయన. రచయితగా, కళాకారుడిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. తన ఆరోగ్యం గురించి కానీ, డబ్బు గురించి కానీ ఏనాడూ ఆలోచించని నిస్వార్థ జీవి” అని కొనియాడారు.
అందెశ్రీ రచించిన ‘నిప్పుల వాగు’ పుస్తకం 20 వేల ప్రతులను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతామని సీఎం వెల్లడించారు. ఆయన అభిమానుల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించి, ఆయనకు సముచిత న్యాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.